Top Headlines Today: మే 19 నాటి షెడ్యూల్డ్ హెడ్‌లైన్స్ ఏంటంటే?
Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి షెడ్యూల్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే.
Top Headlines Today:
నేడు వాలంటీర్లకు వందన కార్యక్రమం
ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి అవార్డులు ప్రదానం చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్నా, సేవా వజ్ర పురస్కారాలు అందించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. మూడేళ్లుగా ప్రభుత్వం ఈ సత్కారం చేస్తోంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, కేవీ విశ్వనాథన్ ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ ఇవాళ ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించనున్నారు. ఈ ఇద్దరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఈ నెల 16న కేంద్రానికి కొలీజియం సిఫార్సు చేసింది. అనంతరం ఈ ఫైల్‌కు రాష్ట్రపతి గురువారం ఓకే చెప్పారు. ఇప్పుడు సుప్రీకంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరబోతోంది.
నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. అసలు మూడు రోజుల క్రితమే సీబీఐ ముందుకు హాజరుకావాల్సి ఉంది. కానీ, షార్ట్ టైంలో హాజరుకాలేనంటూ గడువు కావాలని లెటర్ రాశారు. దానికి ఓకే చెప్పిన సీబీఐ 19న ఉదయం విచారణకు రావాలని పిలిచింది.
నేడు నాదేండ్‌కు సీఎం కేసీఆర్
జాతీయ స్థాయిలో విస్తారించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికే పలువురు నాయకులు ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన శ్రేణులకు విధానాలు చెబుతూ ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలపై శిక్షణ ఇవ్వనుంది బీఆర్‌ఎస్. ఆ శిక్షణ కార్యక్రమాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. నాదేండ్‌లోని అనంత్‌లాన్స్ వేదికగా ఈ శిక్షణ ప్రారంభించబోతున్నారు.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండిగో: ఏవియేషన్ దిగ్గజం ఇండిగో జనవరి-మార్చి కాలంలో రూ. 919 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో ఇది రూ. 1,682 కోట్ల నష్టంతో ఉంది. మార్చి త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 76% పెరిగి రూ. 14,160 కోట్లకు చేరుకుంది.
టాటా ఎల్‌క్సీ: 2022-23 నాలుగో త్రైమాసికంలో టాటా ఎల్‌క్సీకి రూ. 201 కోట్ల నికర లాభం మిగిలింది. గత ఏడాది ఇదే కాలంలోని లాభం రూ. 160 కోట్లతో పోలిస్తే ఇది 25% వృద్ధి. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 23% పెరిగి రూ. 838 కోట్లకు చేరుకుంది
యునైటెడ్ స్పిరిట్స్: Q4FY23లో యునైటెడ్ స్పిరిట్స్‌కు నికర లాభం రూపంలో రూ. 204 కోట్లు మిగిలింది. గత సంవత్సరం కంటే ఇది 7% వృద్ధి. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 25% తగ్గి రూ. 5,783 కోట్లకు పరిమితమైంది.
కంటైనర్ కార్పొరేషన్: నాలుగో త్రైమాసికంలో కంటైనర్ కార్ప్ 8% వృద్ధితో రూ. 278 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలంలో రూ. 2,166 కోట్ల కార్యకలాపాల ఆదాయం వచ్చింది. ఆదాయంలో ఏడాది ప్రాతిపదికన 6% వృద్ధి కనిపించింది.
GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: జనవరి-మార్చి కాలంలో జీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ. 390 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,461 కోట్లుగా ఉంది.
PI ఇండస్ట్రీస్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో పీఐ ఇండస్ట్రీస్ రూ. 281 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ. 1,565 కోట్ల ఆదాయం వచ్చింది.
యునో మిండా: నాలుగో త్రైమాసికంలో యూనో మిండా నికర లాభం 26% పెరిగి రూ. 183 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో ఈ కంపెనీ రూ. 2,889 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
గ్లాండ్ ఫార్మా: జనవరి-మార్చి కాలానికి గ్లాండ్ ఫార్మా రూ. 79 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం రూ. 785 కోట్లుగా ఉంది.
జెట్ ఎయిర్‌వేస్: నాలుగో త్రైమాసికంలో జెట్ ఎయిర్‌వేస్ నష్టాలు రూ. 55 కోట్లకు తగ్గగా, ఆదాయం 13% పెరిగి రూ. 12.4 కోట్లకు చేరుకుంది.