Top 10 Headlines Today: చెన్నై పాంచ్ పవర్, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Top 10 Headlines Today:
ఫైవ్ స్టార్ చెన్నై
ఐపీఎల్ సీజన్‌కు అద్భుతమైన ఫినిష్. ‘షాకులు, ట్విస్టులు, ఝలక్కులు, ప్రతీ సీన్ క్లైమ్యాక్స్‌లా ఉంటది...’ ఈ మ్యాచ్‌కు ఇవన్నీ సరిగ్గా సరిపోతాయి. బంతి, బంతికీ మారిన సమీకరణాలు. ఈ ఓవర్‌కు ముందు మ్యాచ్ చెన్నై చేతిలో ఉంటే, తర్వాతి ఓవర్‌కు గుజరాత్ వైపు. చివరి ఐదు ఓవర్లలో అయితే బోలెడన్ని మలుపులు. ఒకానొక దశలో ఐదు బంతుల్లో 28 పరుగులు వచ్చాయి. కానీ వెంటనే రెండు బంతుల్లో రెండు వికెట్లు. ఇంత కంటే డ్రామా ఎక్కడైనా ఉంటుందా? వీటన్నిటినీ దాటి చెన్నై కప్పును కొట్టింది. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి నాలుగు బంతుల్లో మోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి రెండు బంతులను రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్, టైటిల్ రెండూ చెన్నై ఖాతాలో పడ్డాయి. అంత ఒత్తిడిలో కూడా జడేజా అద్బుతమైన ఆటతీరే చెన్నైకి ట్రోఫీని అందించింది.
డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్లుగా పథకాల అమలు కోసం అభివృద్ధిని పక్కన పెట్టడంతో విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపిస్తున్నాయి. టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు మహానాడులో మొదటి విడత మేనిఫెస్టోలో ఆరు పథకాలను ప్రకటించారు. ఇవన్నీ ఉచిత పథకాలే. మరి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు పడితే... మరి చంద్రబాబు ప్రకటించిన పథకాల వల్ల సమస్యలు రావా ? అనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం. చంద్రబాబు తన సహజశైలికి విరుద్ధంగా వెళ్లారా అన్న అభిప్రాయం కూడా అక్కడే వినిపిస్తోంది.
మార్గదర్శి కేసులో సీఐడీ షాక్
మార్గదర్శి కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్‌కు చెందిన రామోజీరావు ఆస్తులను అటాచ్ చేసేందుకు సీఐడీ ఏపీ హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఖాతాదారులకు డబ్బులు చెల్లించే స్థితిలో మార్గదర్శి లేదని అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రజాప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఐఆర్బీ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road) టోల్ గేట్ లీజు అంశంపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై ఐఆర్బీ డెవలపర్స్ సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చింది. తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారంటూ ఐఆర్ బీ సంస్థ వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేసింది. హెచ్ఎండీఏ సంస్థ ఐఆర్బీ సంస్థకు చేసిన టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయన్నది రఘునందన్ రావు ఆరోపణ.
నాలుగేళ్ల ఉత్సవం
నవ్యాంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన మంగళవారంతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకుని 2023 మే 30న ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవాళ్లకే చిక్కులే
ఈ భూమ్మీద ఉన్న ప్రతి సగటు మనిషికి డబ్బుకు కటకటలాడే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటప్పుడు బంధుమిత్రుల దగ్గర అప్పు తీసుకుంటారు. కావల్సిన మొత్తం పెద్దదైతే, బ్యాంకులు లేదా NBFCల గడప తొక్కుతారు. మంచి క్రెడిట్ స్కోర్‌లు ఉన్న వ్యక్తులకు పర్సనల్ లోన్ దొరకడం పెద్ద మ్యాటరే కాదు. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవాళ్లకే చిక్కొచ్చి పడుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి రూపాయి ఇవ్వడానికి కూడా బ్యాంకులు ఇష్టపడవు.
ధమ్ ధమ్ చేయొద్దు
యువ హీరో సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ టీమ్ నిర్మించిన తాజా చిత్రం ‘మేమ్ ఫేమస్’. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం అవడంతో, విడుదలకు ముందే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసంలు లభించాయి. తాజాగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాపై, సుమంత్ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా బాగుందని, ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాలని ట్వీట్ చేసారు.
సంచలన కేసు
కేరళలో సంచలనం రేపిన లైఫ్ పార్టనర్స్ మార్పిడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో జీవిత భాగస్వాముల మార్పిడికి పాల్పడుతున్న వైనాన్ని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్తతోపాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, భార్యల మార్పిడిపై ఫిర్యాదు చేసిన 26 ఏళ్ల మహిళ జూబీ జాకబ్ ఈ నెల 19న హత్యకు గురైంది. తండ్రి ఇంట్లో ఉంటున్న ఆమె మృతదేహం ఆ ఇంటికి సమీపంలోనే పడి ఉంది. ఆ సమయంలో ఆమె తండ్రి, సోదరుడు ఇంటి వద్ద లేరు. ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె పిల్లలు బయట ఆడుకుంటున్న వేళ ఆ మహిళ జూబీ జాకబ్ హత్యకు గురైంది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆమెను పిల్లలే ముందు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త షినో మాథ్యూ ఆమెను హత్య చేసినట్లు ఆ మహిళ తండ్రి, కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈటల నిర్వేదం
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని.. బిజెపి రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు..హైదరాబాద్ లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సంసందర్భంగా ఆయన వారితో చర్చల గురించి వివరించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల చెప్పుకొచ్చారు. దీంతో పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లయింది..
కొన్ని రాశులవారికి లక్ష్మీయోగం
జ్యేష్ట మాసం శుక్లపక్షం దశమి తిథిరోజు శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం రాశులవారికి శుభాన్ని కలిగించనుంది. జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీ యోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం మకర రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని, అదే సమయంలో శుక్రుని సంచారంతో మరికొన్ని రాశులవారి భవిష్యత్ కూడా ప్రకాశించబోతోందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.