Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా
Legal Notices To Raghunandan Rao : ఓఆర్ఆర్ టోల్ గేట్ లీజు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తమ సంస్థపై చేసిన వ్యాఖ్యలపై ఐఆర్బీ డెవలపర్స్ లీగల్ నోటీసులు ఇచ్చింది.
Legal Notices To Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఐఆర్బీ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road) టోల్ గేట్ లీజు అంశంపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై ఐఆర్బీ డెవలపర్స్ సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చింది. తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారంటూ ఐఆర్ బీ సంస్థ వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేసింది. హెచ్ఎండీఏ సంస్థ ఐఆర్బీ సంస్థకు చేసిన టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయన్నది రఘునందన్ రావు ఆరోపణ.
ఓఆర్ఆర్టోల్ గేట్ ను 30 ఏళ్లపాటు లీజుకు తీసుకున్న ఐఆర్‌బీ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, హత్యలు చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో భారీ అవినీతి జరుగుతోందని, ఆరోపణలు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ లీజును రద్దు చేసుకోని కారణంగా, ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ సీబీఐకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఓఆర్ఆర్ లీజుపై రఘునందన్ రావు ఏమన్నారంటే..
ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న కంపెనీ రూ.7272 కోట్లు కోట్ చేసినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ రూ.7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటించారని రఘునందన్ రావు ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బు ఎవరిని అడిగి పెంచారని ఆయన ప్రశ్నించారు. కవిత, కేటీఆర్ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్ ను లీజుకు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్ ను ఈ ఏడాది ఏప్రిల్ 11న తెరిచినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని రఘునందన్ రావు గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని రఘునందన్ రావు ప్రశ్నించారు. అంతేకాదు కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.
అతి తక్కువ ధరకు కట్టబెట్టేశారన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్ ఓఆర్ఆర్ నిర్వహణను తెలంగాన ప్రభుత్వం అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఓఆర్‌ఆర్ టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.415 కోట్లు ఏడాదికి లభిస్తుండగా.. భవిష్యత్తులో ఈ మొత్తం పెరగనుందన్నారు. బేస్ ప్రైస్ చూసుకున్నా 30 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏటా 5-10 శాతం టోల్ ఛార్జీ పెరిగితే దాదాపు రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు కిషన్ రెడ్డి. కానీ తక్కువ ధరకు ఏడు వేల కోట్లకు ప్రైవేట్ సంస్థకు టోల్ గేట్ లీజుకు ఎలా ఇస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే, ఈ ఓఆర్ఆర్ లీజు విషయంలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తేల్చుతామన్నారు.