Political Foul Language : లీడర్స్..మరీ... కుక్కలు... పందులు స్థాయికి వెళ్ళకండి ప్లీజ్..! సభ్యత హద్దులు దాటిపోతున్న నేతల భాషా ప్రావీణ్యం !
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల భాష దారుణ స్థితికి చేరింది. ప్రజలు వినలేని భాషతో మీడియా ముందు ప్రజల ముందు తిట్టుకుంటున్నారు. ఇకనైనా భాషను సంస్కరించుకోకపోతే వారికి ప్రజల్లో గౌరవం దక్కడం కష్టమే.
" ఇంత కన్నా దిగజారడానికి ఏమీ లేదు అనుకున్న ప్రతీ సారి ఇంకా ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి " ఓ సినిమా డైలాగ్‌కు పేరడీ రాసుకుని ప్రస్తుత రాజకీయ భాషకు అన్వయించుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే భావన కలుగుతుంది. ఫలనా వాళ్లు అంత దారుణంగా తిట్టారు.. ఇక అంత కంటే ఘోరంగా ఎవరూ తిట్టలేరు అనుకుంటే అంచనాలను మించి ఎదుటి వాళ్లు తిట్లు వినిపిస్తున్నారు. ఆ లాంగ్వేజ్‌లో అసువుగా కుక్కలు, పందులు అనే మాటలు కూడా తరచూగా వినిపిస్తున్నాయి. ఈ పతనానికి పరాకాష్ట ఉండదా ? రాజకీయ నేతలు తమను తాము సంస్కరించుకోరా ?
వ్యక్తిగత శత్రువుల స్థాయిలో తిట్టుకుంటున్న నేతలు
రాజకీయ నేతలు వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఎవరూ తమను తాము శత్రువులుగా భావించరు. రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తారు. ఇది ఇప్పటి మాట కాదు. ఓ పదేళ్ల కిందటి నాటి మాట. ఇంకా చెప్పాలంటే ఈ మాట ఇతర రాష్ట్రాల్లో చెల్లుబాటవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే. దానికి తగ్గట్లుగానే రాజకీయ విమర్శలు చేయాలి. చేస్తున్నారు. ఫలితంగా వారి మధ్య శుత్రత్వ స్థాయి దారుణమైన తిట్లు తిట్టుకునే వరకూ వెళ్తుంది. ఎంత వరకూ అంటే ఎదురుపడికే కొట్టడం ఖాయం అన్న హెచ్చరికలు కూడా అందులో ఉన్నాయంటే పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.
Also Read : ఉపఎన్నికలపై హఠాత్తుగా మనసు మార్చుకున్న ఈసీ ! తెర వెనుక ఏం జరిగింది ?
చంద్రబాబు అయినా పవన్ అయినా ఒకటే భాష !
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన రాజకీయ విమర్శలు చేశారు. దానికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు ప్రారంభించారు. అయితే అవి విమర్శల స్థాయిలో లేవు. అంత కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పలేము . దిగువన ఉన్నాయని చెప్పక తప్పదు. అవి విమర్శల స్థాయినుంచి దిగజారిపోయి తిట్ల స్థాయికి వచ్చాయి. ఒక్క పవన్ కల్యాణ్‌నే కాదు ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎంత దారుణంగా తిట్టారో కళ్ల ముందే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ప్రజల చెవులకు చిల్లులు పడేలా తిట్ల భాష వినపడుతోంది. పవన్ కల్యాణ్ గ్రామ సింహాలన్నారు...మంత్రి రేంజ్‌లో ఉన్న పేర్ని నాని వరాహం అనేశారు. ఇంకా రేపు ఏ స్థాయికి దిగజారుతారో అని ఆందోళన చెందడం వారి వారి పార్టీ నేతల్లోనే సామాన్య ప్రజల్లోనూ కనిపిస్తోంది.
Also Read : గాంధీ జయంతి రోజున పవన్ కల్యాణ్ గాంధీగిరి ! ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ? అడ్డుకుంటుందా ?
తెలంగాణ రాజకీయ నేతలదీ అదే భాష !
ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ అంతే ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీజేపీ నేతలు, కార్యకర్తలపై వాడిన భాష కర్ణ కఠోరంగా ఉంది. తర్వాత సీన్‌లోకి మల్లారెడ్డి ఎంటరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష సందర్భంగా విమర్శలు చేశారని వాడు.. వీడు.. గాండు అంటూ తనకు తెలిసిన తిట్లన్నీ తిట్టి పడేశారు. మల్లారెడ్డి తిట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అంతే.. కాంగ్రెస్ నేతలు ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. చోటా మోటా నేతలంతా అమ్మనాబూతులు తిడుతూ వీడియోలు రిలీజ్ చేశారు.
Also Read : రాష్ట్రంలో మరో 20 ఏళ్లు అధికారం మాదే .. పరిశ్రమలకు తెలంగాణ గమ్యస్థానం...
ప్రజల్లో చులకన కావడం మినహా నేతలకు రాజకీయ ప్రయోజనం ఉంటుందా ?
తమలపాకుతో నువ్ ఒకటి అంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అంటూ రెండు పార్టీల నేతలు రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు బూతులతో విరుచుకుపడుతున్నారు. అధికారపక్షంలో ఉండి మరీ తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు తిట్లు లంకించుకోవడం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీల అగ్రనేతలు కూడా తమ వారిని వారించడం లేదు. అలాగే సమాధానం ఇవ్వాలన్నట్లుగా వారు సైలెంట్‌గా ఉండటంతో తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారి సంఖ్య పెరిగిపోయింది. ముందు ముందు మరింత మంది అదే బాటలో పయనించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే జరిగితే రాజకీయం అంటేనే ప్రజలు అసహ్యించుకుంటారు. రాజకీయ నేతలంటే విలువ లేకుండా పోతుంది. అది రాజకీయనేతలకు గౌరవమేనా ?
Also Read : యాచకుడిగా మారిన ప్రభుత్వ ఉద్యోగి... రోడ్డుపైనే జీవనం రేకుల షెడ్డే నివాసం