Drone Attack: డ్రోన్ దాడితో ఠారెత్తిన టవర్ 22
జోర్డాన్లో అమెరికాకు చెందిన సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి
అగ్రరాజ్యం అమెరికాకు (America) ఎంతో వ్యూహాత్మకమైన సైనిక స్థావరం....అమెరికాకు కంటిలో నలుసులా మారిన ఇరాన్ ను (Iran) ఎదుర్కొవాలంటే అత్యంత అనువైన ప్రాంతం. మధ్యప్రాచ్యంపై పట్టు నిలుపుకోవడానికీ...సైనిక బలగాలకు అవసరమైన మందుగుండు సామగ్రి చేరవేయడానికి జోర్డాన్(Jordan)లోని అత్యంత కీలకమైన ప్రదేశమే....టవర్ 22. సిరియా (Syria), ఇరాక్ (Iraq), జోర్డాన్(Jordan) మూడు దేశాల సరిహద్దులు కలసే ఈ చోటు అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రాంతం. ఇస్లామిక్ స్టేట్‌పై(ISIS) పోరుకు ఇది చాలా కీలమైన స్థావరం. సిరియాలో ఉన్న మరో అమెరికా సైనిక స్థావరమైన అల్-టాన్ఫ్‌కు అతి చేరువులో ఉండటం కలిసొచ్చే అంశం. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను అణిచివేయడంలో టాన్ఫ్ స్థావరం ఎంతో కీలకంగా ఉంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు అమెరికా ఎంత పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తుందో....అదే విధంగా ఈ ప్రాంతపై దాడి చేసి పైచేయి సాధించేందుకు ప్రత్యర్థులు సైతం అంతే సాహసానికి పూనుకుంటారు. కానీ ఈసారి ప్రత్యర్థులదే ఒక అడుగు ముందుకు పడింది...
జోర్డాన్‌లో ఉన్న సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి(Drone Attack)తో అమెరికా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయింది. శత్రు దుర్బేధ్యమైన కీలక స్థావరంపై దాడి చేయడమే గాక....ముగ్గురు సైనికులు (Soldiers) ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది సైనికులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి విషమంగా ఉన్న మరో 8 మందిని మెరుగైన వైద్య సేవల కోసం జోర్డాన్ నుంచి హెలీ అంబులెన్స్‌ల ద్వారా తరలించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా దళాలపై జరిగిన తొలి దాడి ఇదే. ఈ దుశ్చర్య వెనక ఇరాన్ మద్దతు కలిగిన గ్రూప్‌ల హస్తం ఉండి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్(Joe Biden) అనుమానం వ్యక్తం చేశారు. దీనికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు.
ఇరాను బలగాలను ఎదుర్కొనేందుకు టవర్ 22 అమెరికాకు ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతం. అటువంటి కీలకమైన మిలటరీ ఔట్‌పోస్టుపైనే డ్రోన్ దాడి(Drone Attack)కి తెగబడటంతో అగ్రరాజ్యం మరింత భద్రత కట్టుదిట్టం చేసింది. ఇక్కడ దాదాపు 350 మంది యూఎస్ సైనికులు, వైమానిక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంజినీరింగ్, ఏవియేషన్, లాజిస్టిక్, సెక్యూరిటీ విభాగాలకు చెందిన సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. జోర్డాన్‌లో దాదాపు 3వేల మంది అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా. ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలను అణిచివేయడంతోపాటు మధ్య ప్రాచ్యంలో ఉగ్ర కార్యకలాపాలను నిలువరించేందుకు ఏడాది పాటు వారు స్థానిక సైనిక బలగాలతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తూనే ఉంటారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొనేందుకు, సిరియా, ఇరాక్ నుంచి మిలిటెంట్లు చొరబడకుండా అడ్డుకునే నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అమెరికా ఇక్కడ లక్షల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇంతటి కీలక స్థావరాన్ని మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకోవడంతో అమెరికా దీటుగానే జవాబిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయోల్- హమాస్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ఇప్పుడు కీలకమైన అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరగడంతో...ఏ క్షణంలో ఏం జరుగుతోందనని సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఇలా దాడి చేయడం ఇదే తొలిసారి కాదని..ఇప్పటి వరకు దాదాపు 150 సార్లు తమ స్థావరాలపై డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులతో దాడులు చేస్తూనే ఉన్నారని అమెరికా ప్రకటించింది. అయితే దాడులకు పాల్పడింది తామేనని ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ప్రకటించింది.