Nandi Awards: టాలీవుడ్ నంది అవార్డులపై కదలిక, డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka: నంది అవార్డులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా కళాకారులకు ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డులపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
![Nandi Awards: టాలీవుడ్ నంది అవార్డులపై కదలిక, డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు Telangana Deputy Cm Bhatti Vikramarka says will Discuss Nandi Awards Issue In telangana Cabinet Nandi Awards: టాలీవుడ్ నంది అవార్డులపై కదలిక, డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/d7a7df3d70190fad3316153db5e677b41705773911503840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nandi Awards Issue: నంది అవార్డులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా కళాకారులకు ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డుల (Nandi Awards)పై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సెక్రటేరియట్ లో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్న నిర్మాతలు నిర్మిస్తున్న సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. నంది అవార్డుల ప్రదానోత్సవంపై త్వరలోనే మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్ మెంట్ ఇష్టమొచ్చినట్లు చేయకుండా... పారదర్శకంగా చేపట్టాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఫిలింనగర్ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలన్న ఆయన...సినిమా రంగం అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని అధికారులను ఆదేశించారు.
చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు ?
చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సినిమా థియేటర్లలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ టికెటింగ్‌పై కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. డ్రగ్స్, వ్యసనాల వ్యతిరేక ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొనేలా ఒప్పించాలని సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రహదారులు భవనాల శాఖ రూపొందించిన ప్రతిపాదనల పై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
ఉగాది నుంచి ఇస్తామని గతేడాది ప్రకటన
వచ్చే ఉగాది నుంచి నంది అవార్డులను ప్రకటిస్తామని గత నెలలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. గతేడాది సీనియర్ నటుడు మురళీ మోహన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన, నంది అవార్డులపై ప్రదానంపై మాట్లాడారు. తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్న కోమటిరెడ్డి, ప్రాంతాలకు అతీతంగా ఉత్తమ నటులకు అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు. నంది అవార్డుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. నటులకు అవార్డులు ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. కొత్త ఏడాది సినీ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం అవుతామని అన్నారు. నంది అవార్డుల ప్రకటనపై మురళీ మోహన్ లాంటి పెద్దల సలహాలు తీసుకుంటామన్నారు.
2017లో చివరిసారి నంది అవార్డులు ప్రదానం
తెలుగు సినిమా రంగంలో నంది అవార్డుకు ప్రతిష్టాత్మక అవార్డుగా పేరున్నప్పటికీ, ఐదేళ్లుగా దానిపై ఎలాంటి ఊసు లేదు. 2017లో చివరిసారి నంది అవార్డులు ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలు సినీ, టీవీ, నాటక రంగాలకు అవార్డులు విషయాన్ని పక్కన పెట్టేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నంది అవార్డుల ప్రదానంపై కేబినెట్ లో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)