Teachers Strike: నిరాహార దీక్ష చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల అరెస్టు
కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు.
తమ రెగ్యులర్ చేయాలని కోరుతూ ఓయూలో నిరాహార దీక్ష చేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో అన్ని యూనివర్సిటీల ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒప్పంద అధ్యాపకులు మాట్లాడుతూ.... రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న 1445 కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు 150 రోజుల నుంచి తమ నిరసనను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు ఉండరని చెప్పిన సీఎం కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ప్రొఫెసర్లను అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని..... ఓయూ పీఎస్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ వచ్చేవరకు తమ దీక్ష విరమించబోమని స్పష్టం చేశారు. ఈ దీక్షకు మద్దతుగా కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మద్దతు పలికారు. దీక్షకు అనుమతి లేదంటూ వారిని అరెస్టు చేశారు ఓయూ పోలీసులు.
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల జేఏసీ పిలుపు మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు చేపట్టిన నిరసన గురువారం కూడా కొనసాగింది. కాంట్రాక్ట్ అధ్యాపకులకు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో తరగతులను బహిష్కరించారు.
ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులతో పాటు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ, స్వేరో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం ఆధునిక బానిసత్వంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం ఉండదని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ నేటికీ అదే విధానం అమలవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
తమను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. తమ అభిమానులను నెరవేర్చాలని గత మూడు నెలలుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్న కానీ కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేలా గన్ పార్క్ కు ర్యాలీగా వెళుతున్న యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిజాం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.
హైదరాబాదులో నిజాం కాలేజీలో యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమను కనుబద్ధీకరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని కాంటాక్ట్ అధ్యాపకులు గన్ పార్క్ వద్దకు ర్యాలీకి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదంటూ వాపోయారు. తాము ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దామని వారిలో కొందరు ఉన్నత స్థాయిలో ఉండి గొప్పవారు అయ్యారని తాము మాత్రం ఇలా రోడ్డుపాలయ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరులో చాలామంది పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారే అని కాంటాక్ట్ అధ్యాపకులు తెలిపారు. తమకు న్యాయం చేయమంటే అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈనెల 11వ తేదీ నుంచి ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.