(Source: ECI/ABP News/ABP Majha)
Tata Airlines Merger: ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం, ఏడాదిలో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం!
Tata Airlines Merger: ఎయిర్ ఇండియా సంస్థలో విస్తారాను విలీనం చేసే ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.
Tata Airlines Merger:
ప్లానింగ్ దశలో..
చాలా రోజుల సస్పెన్స్ తరవాత Air India సమస్యకు పరిష్కారం లభించింది. టాటాసన్స్ గ్రూప్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంతే కాదు. అంతకు ముందు తమ అధీనంలో ఉన్న అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలనూ ఎయిర్ ఇండియా గొడుగు కిందకు తెచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. Vistara, Air Asia, Air India Expressలనూ ఎయిర్ ఇండియాలో విలీనం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది. ఒకవేళ ఇదే జరిగితే...భారత్‌లో రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థగా అవతరిస్తుంది ఎయిర్ ఇండియా. మార్కెట్ షేర్‌లోనూ రెండో స్థానాన్ని ఆక్రమించటం ఖాయం. ఇప్పటికే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోనూ సంప్రదింపులు జరుపుతోంది టాటాసన్స్ గ్రూప్. విస్తారా ఎయిర్‌లైన్స్‌ను టాటాలో కలిపేందుకు ఆ సంస్థ అంగీకరించింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తైతే..తక్కువ ధరలోనే అత్యుత్తమ సేవలు అందించే ఎయిర్‌లైన్స్ సంస్థగా Air India అవతరిస్తుందని ఆ కంపెనీ చాలా ధీమాగా చెబుతోంది. అయితే..దీనికి కనీసం ఏడాది సమయం పడుతుండొచ్చని వివరించింది. ప్రస్తుతానికైతే ఈ డీల్ గురించి టాటా సన్స్ గ్రూప్, విస్తారా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. విస్తారా పేరెంట్ కంపెనీ అయిన టాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49% షేర్‌లున్నాయి. ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యాక...ఈ వాటా 20-25%కి పడిపోతుందని అంచనా. ఇక విస్తారా బోర్డ్ మెంబర్స్‌లో కొందరిని...ఎయిర్ ఇండియా బోర్డ్‌లో చేర్చేందుకూ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. విస్తారా గ్రూప్‌లో టాటా సన్స్‌కు 51% షేర్‌లున్నాయి.
టాటా గ్రూప్ కొనుగోలు..
ఈ సంవత్సరం ప్రారంభంలో, భారత ప్రభుత్వం నుంచి రూ.18,000 కోట్ల వ్యయంతో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఎయిర్ ఇండియా పూర్తి యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఈ కొనుగోలులో భాగంగా చేజిక్కించుకుంది. ఎయిర్ ఏషియా ఇండియాలో 83.67 శాతం యాజమాన్యం, విస్తారాలో 51 శాతం వాటా టాటా గ్రూప్‌నకు ఉంది. విస్తారాలో మిగిలిన 49 శాతం వాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ది. ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా విలీనానికి సంబంధించి, మొదట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ప్యాసింజర్ బుకింగ్ సిస్టమ్‌ను ఏకీకృతం చేస్తారు. దీంతో, మెర్జర్ ప్రాసెస్ మొదలైందని భావించవచ్చు. విలీనం తర్వాత ఏర్పడే ఎయిర్‌లైన్అప్పుడు రెండు రకాల విమాన సర్వీసులు నడుపుతుంది. అవి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737, ఎయిర్ ఏషియాకు చెందిన ఎయిర్‌బస్ 320. ఎయిర్ ఏషియా ఇండియాలో ఉన్న అన్ని విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు మార్చే యోచనలో ఉన్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎయిర్ ఇండియాను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది ఆలోచనల రూపంలోనే ఉంది.
Also Read: BJP Shinde Sena Alliance: ఏ ఎన్నికలైనా సరే కలిసి నడుస్తాం, శిందే శివసేనతో పొత్తుపై బీజేపీ ప్రకటన