Mysore Sandal Soap: మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మిల్కీబ్యూటీ - కర్ణాటకలో రచ్చ - ఎందుకంటే ?
Tamannaah: మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నాను మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి కర్ణాటక ప్రభుత్వం. కానీ కన్నడ వాళ్లు దొరకలేదా అని అక్కడ ఉద్యమనేతలు ఉద్యమం ప్రారంభించారు.

Tamanna Mysoor sandal Row: కర్ణాటక ప్రభుత్వం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించించింది. రెండేల్ల కోసం రూ. 6.2 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించాలని నిర్ణయించారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఉత్పత్తులను తమన్నా భాటియా ప్రమోట్ చేస్తుంది. ఈ నియామకం కర్ణాటకలోని కన్నడ సంఘాలు, స్థానిక నటీనటులు, సోషల్ మీడియా వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
1916లో మైసూరు మహారాజా కృష్ణరాజ వడియార్ IV ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ సోప్ కంపెనీని ప్రారంభించారు. కర్ణాటక సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఈ సోప్ ఉంది. ఇది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. KSDL తమన్నాను రెండేళ్ల కాలానికి రూ. 6.2 కోట్లతో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది, దీని లక్ష్యం కర్ణాటక రాష్ట్రం బయట మార్కెట్ విస్తరణ. తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో 28.2 మిలియన్ల ఫాలోవర్లు, Xలో 5.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
అయితే కర్ణాటక ప్రభుత్వం తయారు చేసే సోప్‌లకు కన్నడ సినిమా పరిశ్రమలో రష్మికా మందన్నా, దీపికా పదుకొణె, రుక్మిణి వసంత్, పూజా హెగ్డే, శ్రీలీలా వంటి ప్రముఖ నటీమణులు ఉన్నప్పటికీ కన్నడేతర నటి తమన్నాను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి కన్నడ సంస్థలు ఈ నిర్ణయాన్ని “కన్నడ వ్యతిరేక” చర్యగా, “స్థానిక ప్రతిభకు అవమానం”గా అభివర్ణించాయి. మైసూర్ శాండల్ సోప్ కర్ణాటక సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగం. దీనిని కన్నడ సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు. అటువంటి బ్రాండ్‌కు కన్నడం మాట్లాడని నటిని ఎంచుకోవడం స్థానిక సెంటిమెంట్‌ను గాయపరిచిందని కన్నడ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
చివరికి మైసూరు రాజవంశం వారసుడు యదువీర్ వడియార్ ఈ నియామకాన్ని “బాధ్యతారహితం, సున్నితత్వం లేనిది”గా అభివర్ణించారు. కన్నడిగుల గుండెల్లో భాగమైన బ్రాండ్‌కు స్థానిక ప్రాతినిధ్యం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. తమన్నాకు భారీగా చెల్లిస్తున్నారని ఈ నిధులను విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని కొంత మంది సలహాలిస్తున్నారు. KSDL గత ఏడాది సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్ లేకుండానే రూ. 400 కోట్ల లాభం సాధించిందని, అటువంటప్పుడు ఇంత భారీ ఖర్చు అనవసరమని యువ కర్ణాటక వేదిక వంటి సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు, ఇది వ్యాపార వ్యూహంలో భాగమని, కర్ణాటక రాష్ట్రం బయట మార్కెట్ విస్తరణ కోసం తమన్నాను ఎంచుకున్నట్లు తెలిపారు. KSDL లక్ష్యం 2028 నాటికి రూ. 5,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించడం, తమన్నా పాన్-ఇండియా అప్పీల్, సోషల్ మీడియా రీచ్ (28 మిలియన్ల ఫాలోవర్లు), యువతలో ప్రజాదరణ, బ్రాండ్‌తో సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. దీపికా పదుకొణె, రష్మికా మందన్నా, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి ఇతర సెలబ్రిటీలను కూడా పరిశీలించినట్లు, కానీ తమన్నా ఎంగేజ్‌మెంట్ నిబంధనలు, ఖర్చు-సమర్థత కారణంగా ఆమెను ఎంచుకున్నట్లు వివరించారు. ఈ వివాదం కొంత కాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.





















