Taliban New: ఆటల్లో కూడా వివక్ష.. పురుషులైతే 400 ఆటలు ఆడుకోవచ్చు.. మహిళల గురించి అడగొద్దట!
తాలిబన్లు రోజుకో ప్రకటనతో అఫ్గాన్ వాసులను భయపెడుతున్నారు. తాజాగా క్రీడలపై స్పందించిన తాలిబన్లు.. పురుషులైతే 400 రకాల ఆటలు ఆడుకోవచ్చని ప్రకటించారు. మహిళల ప్రాతినిథ్యంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సర్కార్ కొలువుదీరిన తర్వాత పరిపాలన సహా నిర్ణయాలపై వరుస ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏ ప్రకటన చూసినా మహిళలపై వివక్ష కొట్టొచ్చినట్లు కనబడుతోంది. యూనివర్సిటీల్లో కో-ఎడ్యూకేషన్ బంద్ నుంచి మహిళల వస్త్రధారణ వరకు అన్ని ప్రకటనలు ఇలానే ఉన్నాయి. తాజాగా అఫ్గాన్ క్రీడాశాఖ చీఫ్ కూడా ఇలాంటి ప్రకటన చేశారు.
ఇవేం ప్రకటనలు బాబు..
అఫ్గాన్‌లో 400 రకాల క్రీడలకు అనుమతి ఇస్తున్నామని క్రీడాశాఖ చీఫ్ బషీర్ అహ్మద్ అన్నారు. అయితే ఇందులో మహిళల ప్రాతినిథ్యంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బషీర్ అహ్మద్ మాజీ కుంగ్ ఫూ, రెజ్లింగ్ ఛాంపియన్. ప్రస్తుత తాలిబన్ సర్కార్‌లో క్రీడాశాఖ డైరెక్టర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
మహిళలపై వివక్ష..
తాలిబన్ల చేతిలో అఫ్గానిస్థాన్ ఏమైపోతుందోనని ప్రపంచం ఆందోళన చెందుతోంది. తాలిబన్లు మహిళలపై ఆంక్షలతో ఇంకెత్త రెచ్చిపోతారోనని అఫ్గాన్ వాసులు హడలిపోతున్నారు. ఎందుకంటే వారి అరాచకత్వాన్ని అఫ్గాన్ వాసులు ఇంకా మరిచిపోలేదు. ముఖ్యంగా మహిళలపై మళ్లీ ఆంక్షలు తప్పవని ఇప్పటికే పలు సంఘటనలతో అర్థమైంది. ఇది ముందే గ్రహించిన అఫ్గాన్ వాసులు ఇప్పటికే చాలా మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇటీవల తాలిబన్ నేతను ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ బెహెస్తా అర్ఘాంద్ కూడా అఫ్గాన్ ను విడిచి వెళ్లారు.
ఆమె తన విధులను నిర్వర్తించకుండా తాలిబన్లు అడ్డుకున్నారని, మహిళలపై ఆంక్షలు లేనప్పుడే తాను తిరిగి అఫ్గాన్ వస్తానని ఆమె అన్నారు. మహిళల వస్త్రధారణపై కూడా తాలిబన్లు ఆంక్షలు విధించారు. యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ ఇక ఉండదని ఇటీవల విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఇలా మహిళలపై వివక్ష చూపిస్తూ తాలిబన్లు వరుస ప్రకటనలు చేస్తున్నారు.
అమెరికా తమ సేనలను ఉపసంహరించిన తర్వాత తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. జర్నలిస్టులు, మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాలిబన్ల అరాచకత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు.
Also Read: హిందూ మహిళతో ముస్లిం పురుషుడి రెండో వివాహం చెల్లదు: హైకోర్టు