Supreme Court Telangana : తెలంగాణ అెధికారులకు చివరి చాన్స్ - లేకపోతే జైలు శిక్ష ఖాయం ! సుప్రీంకోర్టు ఫైనల్ వార్నింగ్
విద్యుత్ ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలను పాటించకపోతే జైలు శిక్ష ఖాయమని స్పష్టం చేసింది.
Supreme Court Telangana : తమ ఆదేశాలను ధిక్కరించిన అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని సుప్రీంకోర్టు ధర్మానసం వ్యాఖ్యానించింది. తెలుగురాష్ట్రాల్లోని విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. ఆంధ్ర నుంచి వచ్చిన పలువురికి నియామక ఉత్తర్వులు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోవాలని పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం కావాలనే అమలు చేయడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.ఇది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది.
ధర్మాధికారి కమిటీ సిఫార్సుల్లో 84 మందికి పోస్టింగ్‌లు ఇవ్వని తెలంగాణ సర్కార్
ఏపీ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదిక అమలు చేయాలని, ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. అక్టోబర్ 31 న ఈ అంశంపై మరోసారి సమీక్షిస్తామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. దాదాపుగా 30 నెలల కిందట ఏపీ నుంచి 655 మంది ఉద్యోగులను జస్టిస్ ధర్మాధికారి కమిటీ తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయించింది. విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల్ని రెండు రాష్ట్రాల మధ్య విభజించేందుకు ధర్మాధికారి కమిటీని నియమించారు. 655 మంది ఉద్యోగులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అదేవిధంగా 655 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పంపాలని జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫార్సు చేసింది.
అటు ఏపీ,.. ఇటు తెలంగాణలో నిరాదరణ ఎదురు కావడంతో సుప్రీంకోర్టులో ఉద్యోగుల పిటిషన్
ధర్మాధికారి కమిటీ సిఫార్సు చేసిన వారిలో 571 మందికి మాత్రమే రాష్ట్ర విద్యుత్ సంస్థలు పోస్టింగులు ఇచ్చాయి. మిగిలిన 84 మందికి పోస్టింగులు ఇవ్వడానికి నిరాకరించాయి. వీరిని న్యాయబద్ధంగా తెలంగాణకు కేటాయించలేదని సంస్థలు వాదిస్తూ వస్తున్నాయి. ఎపి నుంచి 605 మంది ఉద్యోగులు తెలంగాణకు రాగా, తెలంగాణ నుంచి 520 మంది మాత్రమే ఎపికి వెళ్లారని అందుకే చేర్చుకోవడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ విద్యుత్ సంస్తల న్యాయవాదులు వాదించారు. ఏపీ అదనంగా 84 మంది ఉద్యోగులను పంపిందని తెలిపారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది పదవీ విరమణ పొందారు కాబట్టి, ఏపీ రిలీవ్ చేసే వారిలో ఆ మేరకు మినహాయించుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగులు ఎక్కువైనా తక్కువైనా జస్టిస్ ధర్మాధికారి కమిటీని సిఫార్సులు అమలు చేయాల్సిందేనని ఉద్యోగులు స్పష్టం చేశారు. దీంతో 85మంది ఉద్యోగులు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ 84మందిలో ఇద్దరు ఉద్యోగులు ఇప్పటికే కరోనాతో కన్నుమూశారు.
సుప్రీంకోర్టు హెచ్చరికలతో ఉద్యోగులకు ఆశలు
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ అనేక మంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ 84 మంది విద్యుత్ సంస్థల ఉద్యోగులకు అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో ఇప్పటి వరకూ జీతాలు చెల్లించడం లేదు. దాంతో వారి కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వారికి ఊరట లభించే అవకాశం ఉంది.