Super Blue Moon: రాఖీ రోజు ఆకాశంలో అద్భుతం - నేడే చూడండి సూపర్ బ్లూ మూన్
Blue Moon News: సూపర్ మూన్, బ్లూమూన్ గా చంద్రుడు ఈ రోజు అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడని సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రుడు కనిపించే సైజు కంటే 36 శాతం ఎక్కువ సైజుతో ఈరోజు ఉంటాడట.
Super Blue Moon Today: ఆకాశంలోె ఈరోజు అద్భుతం కనిపించనుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు చందమామ కనువిందు చేయనున్నాడు. ఈ ఏడాది మొదటి సూపర్ మూన్ సోమవారం రాత్రి దర్శనమిస్తాడు. సూపర్ మూన్, బ్లూమూన్ గా చంద్రుడు ఈ రోజు అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా చంద్రుడు కనిపించే సైజు కంటే 36 శాతం ఎక్కువ సైజుతో ఈ రోజు చంద్రుడు కనిపిస్తాడు.
భారత కాలమానం ప్రకారం మన దేశంలో సూపర్ బ్లూమూన్ సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 5.32 వరకూ కనిపిస్తుందని సైంటిస్టులు తెలిపారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆయా కాలమానాల ప్రకారం సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు సూపర్ బ్లూమూన్ కనిపిస్తాడని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. కాగా ఈ ఏడాది నాలుగు సూపర్ మూన్ లు ఏర్పడనుండగా ఆగస్టు 19న ఏర్పడేది మొదటిది. మిగతా మూడు సూపర్ మూన్ లు సెప్టెంబర్ 18న, అక్టోబర్ 17న, నవంబర్ 15న ఏర్పడనున్నాయి.
అసలేంటీ సూపర్ బ్లూ మూన్..?
చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అత్యంత దగ్గరగా వచ్చిన సమయంలో ఎక్కువ వెలుతురుతో, పెద్దగా కనిపించే పున్నమి చంద్రుడినే సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్ లు ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు ఏర్పడుతుంటాయి. ఇక బ్లూమూన్ అంటే నీలం రంగులో ఉండే చంద్రుడని అర్థం కాదు. బ్లూమూన్ లు రెండు రకాలుగా ఉంటాయి. ఒక సీజన్ లో నాలుగు ఫుల్ మూన్ లు ఉంటే.. అందులో మూడో ఫుల్ మూన్ ను సీజనల్ బ్లూమూన్ గా పిలుస్తారు. ఇక ఏదైనా ఒక నెలలో రెండోసారి వచ్చే ఫుల్ మూన్ ను మంత్లీ బ్లూమూన్ అని అంటారు. అయితే, ఆయా కాలాల్లో వాతావరణంలో దుమ్ము ధూళిని బట్టి.. కొన్నిసార్లు చంద్రుడు నీలం రంగులో కనిపిస్తుంటాడు. దీన్ని బ్లూ మూన్ గా పిలుస్తుంటారు. అంతేతప్ప నిజానికి చంద్రుడు నీలం రంగులోకి మారిపోయి బ్లూమూన్ లా ఏర్పడటం అంటూ ఉండదు. అయితే, సోమవారం వచ్చే పున్నమి చంద్రుడు అటు సూపర్ మూన్, ఇటు బ్లూమూన్ కూడా కావడంతో దీనిని సూపర్ బ్లూమూన్ అంటున్నారు. అలాగే ఆగస్టు నెలలో వచ్చే ఫుల్ మూన్ ను స్టర్జియన్ మూన్ అని కూడా అంటారు. అందుకే ఈ సూపర్ బ్లూమూన్ ను స్టర్జియన్ మూన్ అని కూడా పిలుస్తున్నారు.
సూపర్ మూన్ అనే పదాన్ని తొలిసారిగా 1979లో రిచర్డ్ నోల్లెచే వాడారు. పౌర్ణమి రోజు 25 శాతం సూపర్ మూన్‌లు ఏర్పడితే 3 శాతం మాత్రమే బ్లూ మూన్స్ ఆవిష్కృతం అమవుతాయి. ఇక ఈ రెండింటి కలయిక చాలా అరుదుగా వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రోజు కనిపించే సూపర్ బ్లూమూన్ తరువాత.. మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ కలయిక 2037లో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.