Seediri Appalaraju : నా లాంటి అన్న పక్కనే ఉంటే కోసి కారం పెడతాడు, మంత్రి సీదిరి అప్పలరాజు హాట్ కామెంట్స్
Seediri Appalaraju : మహిళల్ని వేధించే సమయంలో తాను పక్కనుంటే కోసి కారం పెడతానని మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు దూమరం రేపుతున్నాయి.
Seediri Appalaraju : మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళలను వేధిస్తే ఇకపై చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శ్రీకాకుళంలో దిశ యాప్ డౌన్‌లోడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి అప్పలరాజు.. మహిళల్ని వేధించే సమయంలో తన లాంటి అన్న పక్కనే ఉంటే కోసి కారం పెడతాడని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కూడా పాల్గొన్నారు.
కోసి కారం పెడతా
"యువతులు బస్ స్టాండ్ లలో నిలబడి ఉంటారు. ఎవరో ఆకతాయిలు టీజ్ చేస్తారు. విద్యార్థిలకు కొందరికి ఫోన్లు ఉండవు. అలాంటి సమయంలో నా లాంటి అన్నయ్య పక్కనే ఉంటే, నా మొబైల్ లో దిశ యాప్ లో ఉంటే కోసి కారం పెడతాను. గ్రామాల్లో మహిళా పోలీసులు ఉన్నాయి. మహిళా పోలీసులు గ్రామంలో ఉన్న మహిళలతో సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో మహిళా పోలీసులు ఉన్నారు. మహిళల కోసం కేవలం పోలీసులను నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్, దిశ బైక్స్, దిశ అంబులెన్స్ లు ఏర్పాటుచేశాం. మహిళల రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు పార్లమెంట్ లో ఎన్ని బిల్లులు పెట్టినా కార్యరూపం దాల్చలేదు. ఏపీలో స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. " అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
దిల్లీలో ఆపదలో ఉన్న మహిళను రక్షించాం
మహిళల భద్రతపై ఎస్పీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. దిశ యాప్ అనేది ఒక రక్షణ కవచమన్నారు. దిశ యాప్ ద్వారా దిల్లీలో ఆపదలో ఉన్న ఓ మహిళను కూడా రక్షించామని గుర్తుచేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్, దిశ వాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టి నూతన విధానానికి శ్రీకారం చుట్టి్ందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నైనా జైస్వాల్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీ శక్తిని పెంపొందించడానికి దిశ యాప్ గొప్ప వరం అన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు అమలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకు విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. దిశ యాప్ అనేది మహిళల రక్షణకు కేంద్ర బిందువు అన్నారు.