Congress President Election: కాంగ్రెస్ సారథి ఎవరో తేలేది ఆ రోజే, ఎన్నికల తేదీ ఖరారు చేసిన అధిష్ఠానం
Congress President Election: అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
Congress President Election:
అక్టోబర్ 17న ఎన్నికలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 17వ తేదీన ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. సెప్టెంబర్ 30 వరకూ ఇది కొనసాగుతుంది. దాదాపు అరగంట పాటు సమావేశమైన సీనియర్ నేతలు..ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరి కంటే ఇద్దరు ఈ పోటీలో ఉంటే...అక్టోబర్ 17వ తేదీన ఓటింగ్ కౌంటింగ్ మొదలు పెడతారు. అక్టోబర్ 19న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఎన్నికల షెడ్యూల్‌కు అందరూ ఆమోదం తెలిపారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో సమావేశమయ్యారు పార్టీ నేతలు. ఆయన రాహుల్ గాంధీపైన చేసిన ఆరోపణలనూ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఆజాద్ భాజపాలో చేరతారన్న ఊహాగానాలు వస్తున్నా..ఆయన మాత్రం ప్రత్యేక పార్టీ పెట్టేందుకే ఆసక్తి చూపుతున్నారు. నిజానికి కొత్త అధ్యక్షుడి ఎన్నికపై గతేడాది నుంచే మేధోమథనం సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 21నే ఎన్నికలు చేపట్టాలని భావించారు. కానీ..కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.
రాహుల్ గాంధీ ఏకగ్రీవమా..?
అయితే..ఈ మీటింగ్‌కు ముందుగానే ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. సోనియా గాంధీ..సీనియర్ నేత అశోక్ గెహ్లోట్‌ను కలిశారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని సోనియా..అశోక్‌ను అడిగారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపటం లేదు. వయసు, ఆరోగ్యం రీత్యా ఈ పదవిని చేపట్టలేనని ఆయన ముందే క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా...సోనియా గాంధీ..అశోక్ గెహ్లోట్‌ను పార్టీ బాధ్యతలు తీసుకోవాలని అడిగారు. అయితే...ఇందుకు గెహ్లోట్ ఆసక్తి చూపలేదు. "రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం" అని చెప్పారు.
భారత్ జోడో యాత్ర
"నేనెప్పటి నుంచో ఒకటే విషయం చెబుతున్నాను. కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసేది రాహుల్ గాంధీయే. ఆయన లేకపోతే, ప్రత్యక్షంగా వచ్చి పోరాడకపోతే ప్రజలు అసంతృప్తికి గురవుతారు. పార్టీ కూడా వీక్ అయిపోతుంది. మా అందరి అభిప్రాయాలను గౌరవించి, రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపడితే బాగుంటుంది" అని ఇటీవలే అశోక్ గెహ్లోట్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతే కాదు. ఆయనే అధ్యక్ష పదవి చేపట్టాలని రాహుల్‌ని బతిమాలతామనీ అన్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించకపోతే...ఇంకెవరినీ బలవంతంగా ఆ కుర్చీలో కూర్చోపెట్టకూడదు అని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమై...కశ్మీర్‌లో ముగియనుంది ఈ యాత్ర. ఈ ఏడాది మేలోఉదయ్‌పూర్‌లోని చింతన్ శివిర్ వద్ద "భారత్ జోడో యాత్ర"కు (Bharat Jodo Yatra) సంబంధించిన ప్రకటన చేశారు అధినేత సోనియా గాంధీ. 5 నెలల పాటు సాగనున్న ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో జరగనుంది. మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ..ఈ పాదయాత్రలు, ర్యాలీలు సహా పబ్లిక్ మీటింగ్స్‌లోనూ పాల్గొననున్నారు.
Also Read: Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ రెడీ, తెలంగాణ సర్కారుకు బండి సంజయ్ లేఖాస్త్రం
Also Read: Sonali Phogat Death: ఫోగట్ హత్య కేసులో మొత్తం ఐదుగురు అరెస్ట్, ఆ డ్రగ్గే ప్రాణం తీసిందా?