Shiv Sena Aditya Thackera : "చంద్రబాబూ.. మీ ప్రభుత్వం కూలిపోతుంది.." హెచ్చరించిన ఆదిత్య ఠాక్రే
శివసేన (Uddhav Balasaheb Thackeray) పార్టీ నేత ఆదిత్య ఠాక్రే చంద్రబాబును హెచ్చరించారు. బీజేపీని నమ్మితే ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుందన్నారు.

NDA భాగస్వామ్యపక్షనేతలైన TDP అధ్యక్షుడు చంద్రబాబు, JDU నేత నితీష్ కుమార్ లను ఉద్దేశించి శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు చర్చయనీయాంశం అయ్యాయి. బీజేపీని నమ్మితే ఏం జరుగుతుందన్నది తమను చూసి తెలుసుకోవాలని ఆదిత్య అన్నారు. బీజేపీ విషయంలో వారిద్దరికీ హెచ్చరిక చేశారు.
చంద్రబాబు , నితీష్ జాగ్రత్త...!
మహరాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూలదోసిన వ్యవహారాన్ని ప్రస్తావించిన ఠాక్రే, దాని వెనుక బీజేపీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. తమ పార్టీకి జరిగిన ద్రోహమే భవిష్యత్‌లో TDP, JDU కు జరిగే అవకాశం ఉందన్న ఆయన, ఈ విషయంలో ఆ పార్టీలు నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఢిల్లీలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కావడానికి ముందు ఆదిత్య మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా మారిపోయిందని, ఓట్ల జాబితాల నుంచి ఓటింగ్ మెషిన్ల వరకూ అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. “ దేశ భవిష్యత్ ప్రమాదంలో ఉంది. అసలు ఈ దేశంలో ఎన్నికల నిస్పక్షపాతంగా జరుగుతున్నాయా.. అన్న సందేహం ఉంది. ఇతర రాజకీయ పార్టీలకు వేసిన ఓట్లు ఏమవుతున్నాయో తెలీడం లేదు. మాకు, కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు జరిగిందే రేపు చంద్రబాబు, నితీష్, RJDకి కూడా జరగొచ్చు” అని కామెంట్ చేశారు.
ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే కుట్ర
దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ నాశనం చేసే కుట్రకు బీజేపీ తెరతీసిందని ఆదిత్య ఆరోపించారు. ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీశారని దేశం మొత్తం మీద ఏకపార్టీ విధానం తేవాలన్నది బీజేపీ లక్ష్యం అన్నారు.
“ఢిల్లీ ప్రజలకు ఎంతో చేసిన కేజ్రీవాల్ ఓడిపోయారు. పదేళ్లపాటు ఢిల్లీని మార్చడానికి ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. అయినా కేజ్రీవాల్ ఓడిపోయారంటే.. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కీలకమైన పాత్ర పోషించడమే కారణం” అన్నారు. ప్రభుత్వాలు, పార్టీల గురించి పట్టించుకోకుండా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని ఠాక్రే అన్నారు.
మా సంగతి మేం చూసుకుంటాం
శివసేన UBT వ్యాఖ్యలపై జేడీయు నేతలు స్పందించారు. తన గురించి శివసేనకు ఆందోళన అక్కర్లేదని ఆ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ ఝా అన్నారు. EVM లు వచ్చిన తర్వాతనే బిహార్‌లో దళితులు, బీసీలు ఓట్లు వేయగలుగుతన్నారని అంతకుముందు అంతా బూత్‌ల క్యాప్చరింగ్ ఉండేదన్న ఆయన, శివసేన మళ్లీ అలాంటి వ్యవస్థ కావాలని కోరుకుంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి అయితే దీనిపై స్పందన లేదు.
INDI కూటమిలో ఐక్యత లేకపోవడం వల్లే ఢిల్లీ ఏన్నికల్లో ఓటమి వచ్చిందన్న విశ్లేషణల మధ్య ప్రతిపక్షాలు కలిసుండాలని ఠాక్రే వ్యాఖ్యలు చేయడం ముఖ్యమైన విషయమే. అలాగే ఇండియా కూటమి పక్షాలు మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమిలోని రాజకీయ పార్టీలను కూడా జాగ్రత్త పడాలంటూ బీజేపీ గురించి హెచ్చరిస్తున్నారు. అలాగే ఎన్నికల ఫలితాల్లో ఎన్నికల సంఘం ముఖ్యపాత్ర పోషిస్తోందన్న విషయాన్ని ఇండి అలయెన్స్ పార్టీలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. మహరాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు జరిగాయని అక్కడ వయోజనుల జనాభా కన్నా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు శివసేన ఢిల్లీ ఎన్నికల గురించి అదే చెబుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

