(Source: ECI/ABP News/ABP Majha)
Shashi Tharoor: ఆయన వ్యాఖ్యల్లో లాజిక్ ఉంది కానీ - పవార్ కామెంట్స్‌పై స్పందించిన శశి థరూర్
Shashi Tharoor: జేపీసీపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శశి థరూర్ స్పందించారు.
Shashi Tharoor on JPC:
సమర్థించిన థరూర్..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అదానీ వ్యవహారంపై స్పందించారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ అవసరం లేదన్న శరద్ పవార్ వ్యాఖ్యల్ని సమర్థించారు. ఆయన మాట్లాడిన దాంట్లో లాజిక్ ఉందని అన్నారు. ఇదే సమయంలో తన అభిప్రాయాన్నీ వెల్లడించారు. తమ పార్టీతో పాటు అన్ని ప్రతిపక్షాలూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణతో నిజాలు బయటకు వస్తాయన్న బలంగా నమ్ముతున్నాయని స్పష్టం చేశారు. ఈ విచారణతో కొన్ని విషయాల్లో స్పష్టత తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"శరద్ పవార్ లాజిక్ ఏంటో మాకర్థమైంది. ఆయన చెప్పింది నిజమే కావచ్చు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎక్కువ మంది రూలింగ్ పార్టీ వాళ్లే ఉంటారు. 50%పైగా బీజేపీ సభ్యులే ఉంటారన్న మాట వాస్తవమే. కానీ...ఈ కమిటీ వేయడం వల్ల ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం కలుగుతుంది. వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. పేపర్ల రూపంలో సమాధానాలు వస్తాయి. ఆ ఫైల్స్‌ని చెక్ చేసేందుకు వీలవుతుంది. అందుకే జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో ప్రయోజనం కలుగుతుందని మేమంతా నమ్ముతున్నాం"
- శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
శరద్ పవార్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ...పార్లమెంట్‌లో మాత్రం తమకే సపోర్ట్ చేస్తున్నారని స్పష్టం చేశారు థరూర్. సభ వాయిదా పడిన ప్రతిసారీ NCP తమకు మద్దతుగా నిలిచిందని చెప్పారు.
"కేంద్ర ప్రభుత్వం జేపీసీ నియామకానికి సిద్ధంగా లేదు. శరద్ పవార్ ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించి ఉండొచ్చు. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సభలు వాయిదా పడిన ప్రతిసారీ ఎన్‌సీపీ మాకు అండగా ఉంది. విజయ్ చౌక్ వద్దకు ర్యాలీ చేసిన సమయంలోనూ పవార్ మాకు మద్దతునిచ్చారు"
- శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
అదానీ వ్యవహారంపై దాదాపు నెల రోజులుగా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హిండన్‌బర్గ్ రిపోర్ట్‌లో ఉన్నవన్నీ నిజాలే అని, కేంద్రం దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. అంతే కాదు. ఈ స్కామ్‌పై పూర్తి స్థాయి విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనూ నల్ల దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. దీనిపై మిగతా పార్టీలనూ కలుపుకుని పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీని టార్గెట్ చేసుకుని కావాలనే ఆ రిపోర్ట్ విడుదల చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యవహారంపై విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌నూ తోసిపుచ్చారు పవార్. ఆ కమిటీ ద్వారా నిజాలేవీ బయటకు రావని తేల్చి చెప్పారు.
"ఇప్పటికే చాలా సార్లు మా మీటింగ్‌లో నేను చెప్పాను. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినా వృథాయే. ఆ కమిటీలో 21 మంది సభ్యులుంటే...అందులో 15 మంది బీజేపీ వాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఓ సూచన చేశాను. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ స్వతంత్ర కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పాను"
- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత
Also Read: Ashok Gahlot vs Sachin Pilot: సొంత ప్రభుత్వంపైనే సచిన్ పైలట్ అసహనం, నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రకటన