Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
YS Jayanti : విజయవాడలో జరగనున్న వైఎస్ జయంతికి రావాలని రేవంత్, భట్టి విక్రమార్కలను షర్మిల కోరారు. హైదరాబాద్‌లోని వారి నివాసాల్లో షర్మిల సమావేశం అయ్యారు.
Sharmila Invited Revanth and Bhatti Vikramarka : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో సమావేశం అయ్యారు. జూలై ఎనిమిదో తేదీన వైఎస్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు చేసుకుటున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని ఆహ్వానిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలను కూడా షర్మిల ఆహ్వానించారు.
వైఎస్‌తో అనుబంధం ఉన్న వారందరికీ పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్న వారినందర్నీ ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో షర్మిల సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో కూడా వైఎస్ జయంతిని భారీగా నిర్వహించారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో షర్మిల వేరే పార్టీ పెట్టుకోవడమే దీనికి కారణం. ఈ సారి పెద్ద ఎత్తున తెలంగాణలోని వైఎస్ ఆత్మీయులు విజయవాడలో జరగబోయే వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా అన్నదానిపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నేతలతో వైఎస్ కు ప్రత్యేక అనుబంధముంది. భట్టి విక్రమార్క ఇప్పటికీ వైఎస్ ఫోటోను తన ఇంట్లో ఉంచుకుంటారు. రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు దండం పెట్టుకునే బయలుదేరుతారు. తెలంగాణలో అనేక మంది సీనియర్ నేతలకు వైఎస్ తో కలిసి పని చేశారు.
వైఎస్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు షర్మిల వ్యూహం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. వైసీపీలోని వైఎస్ ఆత్యంత ఆత్మీయులకు కూడా ఆహ్వానాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన వారసురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించడాన్ని టాస్క్ గా తీసుకున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు వైఎస్ జయంతి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఓటమి భారంలో ఉన్ నవారు.. వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించే పరిస్థితుల్లో లేరు.
ఏ కార్యక్రమం నిర్వహించే స్థితిలో లేని వైసీపీ
అయితే ఇప్పుడు షర్మిల ఘనంగా వైఎస్ జయంతిని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నందున తాము పట్టించుకోకపోతే వైఎస్ అభిమానులంతా కాంగ్రెస్ వైపు వెళ్లిపోతారన్న ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. అందుకే తమ పార్టీ నేతల్ని వైఎస్ జయంతి కార్యక్రమానికి వెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారు. కానీ కొంత మంది నేతలు మాత్రం.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వారు.. వెళ్లే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అగ్రనేతలు కూడా పోటీగా వైఎస్ జయంతి కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.