యూజర్స్‌కి షాక్ ఇవ్వనున్న అమెజాన్, ఏప్రిల్ 7 తరవాత ఆ ఉత్పత్తులపై ధరల బాదుడు!
Amazon Products: అమెజాన్‌లో ఏప్రిల్ 7 తరవాత కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.
Amazon Seller Fee Hike: అమెజాన్ త్వరలోనే యూజర్స్‌కి షాక్ ఇవ్వనుంది. ఏప్రిల్ 7వ తేదీన తరవాత సెల్లర్ ఫీ (Seller Fee) పెంచనుంది. ఆ మేరకు వినియోగదారులపైనే భారం పడనుంది. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో చాలా మంది సెల్లర్స్ ఉంటారు. వాళ్ల నుంచి మనం కొనుగోలు చేస్తాం. ఇలా అమెజాన్‌లో తమ ప్రొడక్ట్స్‌ని పెట్టినందుకు సెల్లర్స్ నుంచి అమెజాన్ కొంత ఫీజు వసూలు చేస్తుంది. ఇందులో స్టోరేజ్, టెక్నాలజీ, షిప్పింగ్ సహా రిటర్స్ ఛార్జీలు అన్నీ కలుపుకుని ఉంటాయి. అయితే...ఏప్రిల్ 7వ తేదీ తరవాత ఈ Seller Fee Structure ని మార్చనుంది అమెజాన్. ఫలితంగా కొన్ని ప్రొడక్ట్స్ ధరలు పెరగనున్నాయి. ఈ ఫీజులో 18% GSTని చేర్చడం లేదు. Moneycontrol రిపోర్ట్ ప్రకారం...ఇంటి అలంకరణ ఉత్పత్తులపై 9% ఉన్న సెల్లర్ ఫీని 13.5%కి పెంచనుంది. లగ్జరీ బ్యూటీ ఐటమ్స్‌పై 5% నుంచి ఏకంగా 10%కి పెంచనున్నట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. స్లీప్‌వేర్ కేటగిరీలోని ప్రొడక్ట్స్‌కి సంబంధించిన సెల్లర్ ఫీ 11-15% నుంచి 19% వరకూ పెంచే అవకాశాలున్నాయి.
ఫ్లిప్‌ఫ్లాప్స్‌పై 13-15%,మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై 10.5% సెల్లర్ ఫీ వసూలు చేయనుంది అమెజాన్. ఇదే సమయంలో కొన్ని ఉత్పత్తులపై సెల్లర్ ఫీ ని తగ్గించనుంది. ఇన్వర్టర్‌లు, బ్యాటరీలపై ప్రస్తుతం ఉన్న 5.5% ఫీజుని 4.5% కి తగ్గించనుంది. ఇక చిన్నారుల దుస్తులపై సెల్లర్ ఫీ 11-21% నుంచి 11-20% తగ్గనుంది. ఆపరేషన్ కాస్ట్‌లు, వడ్డీ రేట్‌లు, ద్రవ్యోల్బణం..వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇలా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తోందని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. మార్కెట్‌లోని పోటీని తట్టుకుని నిలబడుతూనే చిన్న తరహా వ్యాపారులకు మేలు చేసే విధంగా తమ విధానాలు ఉంటాయని అమెజాన్ స్పష్టం చేసింది. ఇలాంటి మార్పులు చేస్తేనే మార్కెట్‌లో కొనసాగడానికి అవకాశముంటుందని వెల్లడించింది. భారత్‌లో నెట్‌వర్క్‌ని విస్తరించడం తమ ప్రాధాన్యత అని తెలిపింది. మామాఎర్త్, బోట్ సహా మిగతా బడా బ్రాండ్‌లన్నింటికీ ఈ మార్పులు వర్తిస్తాయని వివరించింది. అంటే..ఆయా ప్రొడక్ట్‌ల ధరలు పెరిగే అవకాశాలున్నాయి.