Sanjay Raut: కిటికీలు, వెంటిలేషన్ లేని గదిలో బంధించారు - ఈడీపై సంజయ్ రౌత్ అసహనం
Sanjay Raut: ఈడీ తనను వెంటిలేషన్ గదిలో ఉంచింది సంజయ్ రౌత్ అసహనం వ్యక్తం చేశారు.
Sanjay Raut:
ఏసీ ఉన్నా..వినియోగించుకోలేను: సంజయ్ రౌత్
పత్రా చాల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కోర్టులో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఆయన, ఈడీ తనతో వ్యవహరించిన తీరుపై ఆగ్రహించారు. కిటికీలు, వెంటిలేషన్ లేని రూమ్‌లో తనను ఉంచారని అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ PMLAకి సంబంధించిన హియరింగ్స్ కోసం నియమించిన స్పెషల్ కోర్ట్ జడ్జ్‌కి ఇది వివరించారు సంజయ్ రౌత్. ఈడీపై ఏమైనా ఫిర్యాదులున్నాయా అని జడ్జ్ అడిగిన సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈడీ తరపున న్యాయవాదికి ఇందుకు వివరణ ఇచ్చారు. సంజయ్ రౌత్‌ను AC గదిలో ఉంచామని, అందుకే కిటికీ లేదని చెప్పారు. దీనిపై సంజయ్ రౌత్‌ను ప్రశ్నించగా.."తన గదిలో ఏసీ ఉందని, కానీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆన్ చేసుకోలేదని" అని అన్నారు. వెంటనే స్పందించిన ఈడీ, వెంటిలేషన్ ఉన్న గదిలోనే సంజయ్ రౌత్‌ను ఉంచుతామని స్పష్టం చేశారు.
ఎందుకు అరెస్ట్ చేశారు..?
దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు.. సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అరెస్ట్‌ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. భాజపా "బెదిరింపు" రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ కూడా ఈ అంశంపై స్పందించారు. సంజయ్ రౌత్‌ను ఎంతో ధైర్యమైన వ్యక్తిగా అభివర్ణించిన ఆయన..భాజపాపై విమర్శలు గుప్పించారు. కాషాయ పార్టీపై మండిపడుతూ ట్వీట్ చేశారు. "భాజపా రాజకీయాలకు, బెదిరింపులరు సంజయ్ రౌత్ ఎప్పుడూ తలొగ్గలేదు. ఆయన చేసిన నేరం అదే. నేరారోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ ఎంతో ధైర్యవంతుడు. ఆయనకు అండగా మేముంటాం" అని ట్వీట్‌లో పేర్కొన్నారు అధిర్ రంజన్.
అటు మరో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా స్పందించారు. భాజపా, సెంట్రల్ ఏజెన్సీని దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. "ప్రభుత్వ సంస్థలు ఉన్నది రాజకీయాలు చేయటం కోసం కాదు" అని అభిప్రాయపడ్డారు. "ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే భాజపా ఇలా చేస్తోంది" అని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖార్గే అన్నారు. "భాజపాకు అపోజిషన్ ముక్త్ పార్లమెంట్ కావాలి. అందుకే సంజయ్ రౌత్‌ను ఇలా ఇరికించారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖార్గే.
Also Read: CM KCR : సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కావాలి -సీఎం కేసీఆర్
Also Read: Hair Cutting: జుట్టు చివర్ల కత్తిరిస్తే నిజంగానే పెరుగుతుందా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?