Russia Ukraine War: యుద్ధంలో లక్ష మంది రష్యా సైనికులు హతం, లెక్కలు చెబుతున్న అమెరికా
Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా దాదాపు లక్ష మంది రష్యా సైనికులు చనిపోయినట్టు అమెరికా చెబుతోంది.
Russia Ukraine War:
ఖేర్సన్ నుంచి బలగాలు వెనక్కి..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆర్నెల్లుగా ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంది. రెండు దేశాలూ ఇప్పటికే చాలా నష్టపోయాయి. అయితే... రష్యా కూడా ఉక్రెయిన్‌తో సమానంగా నష్టం మూటగట్టుకుందని ఇప్పటికే కొన్ని నివేదికలు తేల్చి చెప్పాయి. ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా సైన్యాన్ని తరిమి కొడుతున్నట్టు చెబుతోంది. ఇటీవలే రష్యా...దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. తమ నష్టాన్ని తగ్గించుకునేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ఈ యుద్ధం కారణంగా..40 వేల మంది ఉక్రెయిన్ పౌరులు, లక్ష మంది రష్యా సైనికులు చనిపోయారని తెలుస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ఓ కీలక ప్రకటన చేశారు. రష్యాతో శాంతియుత చర్చలకు సిద్ధమేనని వెల్లడించారు. అయితే...ఇప్పటి వరకూ రష్యా ఆక్రమించుకున్న
భూభాగాలను తిరిగి వెనక్కు ఇచ్చేయాలన్న కండీషన్‌పైనే తాను చర్చలకు ముందుకొస్తానని వెల్లడించారు. ఖేర్సన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకున్న సమయంలోనే రష్యా ఓ ప్రకటన చేసింది. శాంతియుత చర్చలకు తామూ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అయితే... ఖేర్సన్‌లో 20-30 వేల మంది రష్యా సైనికులున్నారని, ఉపసంహరణకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశముందని అమెరికా చెబుతోంది. కేవలం తమ సైన్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతోనే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని అగ్రరాజ్యానికి చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా రష్యా మరోసారి సైన్యాన్ని ఎప్పుడైనా మొహరించే అవకాశముందని, కానీ...శాంతియుత చర్చలకు మాత్రం మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్ లెక్కలివీ..
ఉక్రెయిన్ చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో 71,200 మంది రష్యా సైనికులు తమ చేతిలో చనిపోయారని ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంటోంది. అయితే ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తరచూ అణు దాడుల గురించి ప్రస్తావిస్తూ టెన్షన్ పెడుతున్న ఆయన...ఈసారి మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు.
ఖేర్సన్ నుంచి తమ బలగాలను వెనక్కి రప్పిస్తామని చెబుతూనే...అణుదాడుల గురించి చర్చించటం అంతర్జాతీయంగా అలజడి సృష్టిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మాట్లాడిన సందర్భంలో జపాన్‌పై జరిగిన అణుదాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పుతిన్. ఇదే పశ్చిమ దేశాల నేతలను కలవరానికి గురి చేస్తోంది. "రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోవటానికి, జపాన్ సరెండర్ అయిపోటానికి కారణమైన అణుదాడులను చూస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. విజయం సాధించటానికి పెద్ద నగరాలపైనే దాడి చేయాల్సిన పని లేదు" అని వ్యాఖ్యానించారు పుతిన్. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ అణుబాంబులు ప్రయోగి స్తారేమో అన్న భయం మొదలైంది. నిజానికి...ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టినప్పటి నుంచే అణుదాడుల అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే...ఈ మధ్య కాలంలో పుతిన్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తుండటంపై అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే బదులిస్తోంది.
Also Read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: అరబిందో ఫార్మా డైరెక్టర్, మరో కీలక వ్యక్తి అరెస్టు