Russia Ukraine War: రష్యా దూకుడుకు కళ్లెం వేస్తున్న చలి! పుతిన్ వెనక్కి తగ్గుతారా?
Russia Ukraine War: పుతిన్ దూకుడుకు శీతాకాలం కళ్లెం వేస్తోందన్న చర్చలు వినిపిస్తున్నాయి.
Russia Ukraine War:
చలి ఇబ్బందులు..
ఈ ఏడాది కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాన్నాళ్ల పాటు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇద్దరు దేశాధ్యక్షులు వెనక్కి తగ్గేందుకు మొగ్గు చూపడం లేదు. ఉక్రెయిన్‌ను సాధిస్తాం అని రష్యా చెబుతుంటే...అది అసాధ్యమని ఉక్రెయిన్ కౌంటర్ ఇస్తోంది. దాదాపు 50 వేల మంది సైనికులను యుద్ధ రంగంలో మొహరించినట్టు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. మరో రెండున్నర లక్షల మందిని సిద్ధం చేసి ఎప్పుడైనా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తామన్న సంకేతాలిస్తున్నారు. అయితే...ఇప్పుడు శీతాకాలం కావడం వల్ల యుద్ధరీతిలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇప్పటికే రష్యన్ సైనికులు చలి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే...రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తీసుకోనుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
ఇవీ ఆప్షన్లు
రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయం మనదే అంటూ న్యూ ఇయర్ స్పీచ్‌లో సైనికులకు ధైర్యం నూరిపోశారు. అటు ఉక్రెయిన్ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోడానికి చూస్తున్నా..యుద్ధ రంగంలో మాత్రం రష్యన్ సేనలతో గట్టిగా పోరాడుతోంది. ఇది ఓ కొలిక్కి వచ్చే వరకూ ఉక్రెయిన్ సైన్యం అస్త్ర సన్యాసం చేయదమని స్పష్టం చేసింది. ఈ వాడివేడి వాతావరణంలో చర్చలకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పూర్తిగా ఓ పక్షం వెనక్కి తగ్గితే తప్ప యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్ ఆక్రమణకు వాతావరణ పరిస్థితులు మాత్రం రష్యాకు కళ్లెం వేస్తున్నాయి. అందుకే...చలికాలం పూర్తయ్యే వరకూ వేచి చూసి మళ్లీ యుద్ధం కొనసాగించే అవకాశాలున్నాయి. ఇక్కడే మరో విషయమూ మాట్లాడుకోవాలి. ఒకవేళ రష్యా చలి కాలం కారణంగా వెనక్కి తగ్గితే...అప్పుడు ఉక్రెయిన్ పుంజుకునే అవకాశముంది. రష్యా అధీనంలోని డోన్‌బాస్ ప్రాంతాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోడానికీ ప్రయత్నం చేస్తుండొచ్చు. ఒకవేళ ఉక్రెయిన్ రష్యాపై అగ్రెసివ్‌గా అటాక్ చేస్తే మాత్రం...మళ్లీ రష్యా గట్టిగా దెబ్బ కొట్టేందుకు ముందుకొస్తుంది. మళ్లీ కథ మొదటికే వస్తుంది. అయితే...ఇప్పటికే ఉక్రెయిన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. రష్యా వెనక్కి తగ్గితే...రష్యా, క్రిమియాను కలిపే రోడ్డు, రైల్ మార్గాలపై పట్టు సాధించాలని చూస్తోంది.
ఉక్రెయిన్ సేఫ్..!
శీతాకాలం అయినప్పటికీ...ఉక్రెయిన్ సైన్యానికి మాత్రం పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అన్నది అంతర్జాతీయ విశ్లేషకుల మాట. బ్రిటన్, కెనడా, జర్మనీ దేశాలు ఉక్రెయిన్‌కు ఈ మేరకు సాయం అందిస్తున్నాయి. హీటింగ్ ఎక్విప్‌మెంట్ అందించి ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. ఇలా అన్ని పాశ్చాత్య దేశాలూ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటే అప్పుడు పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయి. రష్యాపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను అంతర్జాతీయ సమాజం ఇంకాస్త గట్టిగా వినిపిస్తుండొచ్చు. అప్పుడు కూడా రష్యా దూకుడుగానే వ్యవహరిస్తే యుద్ధం ముదిరి పెద్ద ఎత్తున ప్రాణనష్టమూ సంభవించే ప్రమాదముంది. మొత్తానికి యుద్ధం ఏ మలుపు తిరుగుతుందనేది ఇంకా స్పష్టత రావడం లేదు.
Also Read: Bharat Jodo Yatra: హే రామ్ సినిమా అందుకే చేశాను, తమిళం మా గర్వం - రాహుల్‌తో కమల్ హాసన్