Russia Ukraine Conflict: 'మూడో ప్రపంచ యుద్ధం తప్పదు'- పశ్చిమ దేశాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్!
Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది.
Russia Ukraine Conflict: రష్యా మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల హెచ్చరించారు. అయితే తాజాగా మూడో ప్రపంచ యుద్ధం (Russia Warns World War III Against Ukraine) రావొచ్చని రష్యా వార్నింగ్ ఇచ్చింది.
చేర్చుకుంటే
ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెన్డిక్టోవ్ హెచ్చరించారు.
రష్యాకు సంబంధించిన ఆస్తులపై దాడులకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఉక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు.
జీ7 దేశాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించడంపై జీ7 దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోందని మండిపడ్డాయి. పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై కూడా జీ7 దేశాలు తీవ్రంగా స్పందించాయి.
" ఉక్రెయిన్ అవసరాలను తీర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా చేస్తోన్న దాడులను జీ7 దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యా ఎలాంటి రసాయన, జీవ, అణ్వాయుధాలను వాడినా తీవ్ర పరిణామాలు తప్పవు. ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆర్ధిక, సైనిక, దౌత్య, న్యాయ సాయం అవసరమైనా అందించేందుకు, ఆ దేశానికి బాసటగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాం. "
వర్చువల్ భేటీ
ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమంపై చర్చించేందుకు జీ7 దేశాధినేతలు వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ చర్యలకు పుతిన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా అణ్వాయుధాలు వాడితే తీవ్ర పరిణామాలు తప్పవని జీ7 హెచ్చరించింది.