Railway ticket concessions : మళ్లీ రైళ్లలో వృద్ధులకు రాయితీలు - కానీ షరతులు వర్తిస్తాయి !
రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రద్దు చేసిన రాయితీలను స్వల్పంగా పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై రైల్వే బోర్డు చర్చిస్తోంది.
Railway ticket concessions : రైళ్లలో వృద్ధులకు తీసేసిన రాయితీని మళ్లీ పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే శాఖ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో రైల్వే బోర్డు సమీక్ష చేసింది. మళ్లీ సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధురించాని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే షరతులు వర్తిస్తాయని చెబుతున్నారు. కేవలం 70 ఏళ్లు పైబడి జనరల్, స్లీపర్ తరగతుల్లో ప్రయాణించే వారికి మాత్రమే రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎప్పుడైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
బంగాల్ రాజకీయంలో 'గోపాల గోపాల'- BJPతో టచ్‌లో 38 మంది TMC ఎమ్మెల్యేలు!
కొవిడ్ ముందు 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 ఏళ్లు దాటిన పురుషులకు రాయితీ వర్తించేది. మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం టికెట్‌లో రాయితీ ఇచ్చేవారు. కోవిడ్ కారణంగా రైళ్లన్నీ ప్రత్యేక రైళ్లుగా మార్చారు. ఈ కారణంగా ఎవరికీ ఎలాంటి రాయితీలు అందుబాటులో లేవు. మళ్లీ సాధారణ సర్వీసులు ప్రారంభించడంతో రాయితీల ప్రస్తావన వచ్చింది. అయితే సీనియర్ సిటిజన్ల రాయితీని ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ విమర్శలు రావడంోత కేవలం 70 ఏళ్లు దాటిన వారికి మాత్రమే రాయితీ ఇవ్వాలని రైల్వే యోచిస్తోంది.
Also Read: Spicejet Flight: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై DGCA సీరియస్- కీలక ఆదేశాలు
ఇక నుంచి ఎలాంటి రాయితీ అయినా కేవలం నాన్-ఏసీ తరగతులకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై సమీక్ష జరుగుతోందని, పూర్తి స్థాయిలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రైల్వే బోర్డు వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. అయితే రాయితీకు షరతులు పెట్టడం వల్ల భారం తగ్గుతుందని రైల్వే బోర్డు భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రైల్వే తన ఆదాయం పెంచుకునేందుకు మరో ఆలోచన చేస్తోంది. అన్ని రైళ్లలోనూ ప్రీమియం తత్కాల్ కోటాను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 రైళ్లలో మాత్రమే ప్రీమియం తత్కాల్ కోటా అమలౌతోంది. ఈ స్కీమ్ కింద కొన్ని టికెట్లను కేటాయిస్తారు. వీటికి డైనమిక్ ఫేర్ అమలౌతుంది. తత్కాల్ కోటాతో పోలిస్తే ఈ టికెట్లు కాస్త ఖరీదుగానే ఉంటాయి. సీట్లు భర్తీ అవుతున్న కొద్దీ టికెట్ ధర పెరుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో బుక్ చేసుకున్న వారికి ఎక్కువ ధర పడుతుంది. అంటే ఓ రకంగా వేలం పాటలా అన్నమాట.