Rahul Gandhi New House: బంగ్లా ఖాళీ చేస్తున్న రాహుల్ గాంధీ, తల్లి ఇంటికే షిఫ్ట్ అవుతున్నారట!
Rahul Gandhi New House: రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సోనియా గాంధీ ఇంటికి షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది.
Rahul Gandhi New House:
సోనియా గాంధీ ఇంటికి...
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన వెంటనే ఆయన అధికారిక నివాసమైన బంగ్లాను ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి తన ఆఫీస్‌ను తరలించే పనిలో ఉన్నారు రాహుల్. కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ తమ ఇంటికి రావాలంటూ వెల్‌కమ్ చెప్పారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే..రాహుల్ గాంధీ 10 జన్‌పథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ ఇంటికి షిఫ్ట్ అవనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాహుల్ బంగ్లాలోని సామాన్లను సోనియా ఇంటికి తరలిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఆఫీస్ కోసం మరో ఇంటినీ వెతుకున్నారని తెలుస్తోంది. బంగ్లా ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చిన వెంటనే ఎమోషనల్‌గా స్పందించారు రాహుల్.
"2004 నుంచి నేను ఇదే బంగ్లాలో ఉంటున్నాను. ఈ ఇంటితో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. కానీ మీరు పంపించిన లేఖ ప్రకారం...త్వరలోనే ఖాళీ చేస్తాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
ఈ లెటర్ రాసిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రావాలనుకుంటే తన ఇంటికి రావచ్చని ఆహ్వానం పలికారు. ఒకవేళ రాహుల్‌కు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా తన ఇంటికి నేరుగా రావొచ్చని ప్రకటించారు. తన ఇంట్లో ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామనీ అన్నారు.
పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెయిల్‌ను సూరత్ సెషన్స్ కోర్టు పొడిగించింది. ఈ కేసులో తన శిక్షను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేయడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 13న వాయిదా వేసింది సూరత్ కోర్టు. 2019కి సంబంధించిన పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సూరత్ సెషన్స్ కోర్టుకు చేరుకున్నారు. రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రులు భూపేష్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నారు. భారీ భద్రత నడుమ సూరత్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ తన జైలుశిక్ష తీర్పును సవాల్ చేశారు. రాహుల్ గాంధీ 2019లో మోదీ అనే ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్ల శిక్ష రద్దుకు సంబంధించిన పిటిషన్‌పై మే 3న సూరత్ సెషన్స్ కోర్టు విచారణ జరపనుంది.- అయితే బెయిల్ పొడిగింపు, శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. శిక్ష రద్దు పిటిషన్ మే 3న విచారణకు రానుంది.