AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
Andhra Pradesh News | ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం ఈ నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం.
Andhra Pradesh Government News | అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీచ చేస్తున్నారు. వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా మద్యం దుకాణాలలో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. రోడ్లపై ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం మరోవైపు ఏపీ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సైతం ఉక్కుపాదం మోపుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కన్పిస్తోంది.
జనవరి 2న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు ఉద్యోగులకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. పీఆర్సీతో పాటు మధ్యంతర భృతిపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. జనవరి 2న జరగనున్న ఏపీ కేబినెట్ లో ఈ నిర్ణయాలకు ఆమోద ముద్ర పడనుంది. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
అమరావతి: ఏపీ గవర్నర్‌ను సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ అబ్దుల్‌నజీర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం చంద్రబాబు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. మధ్యాహ్నం 12.45 గంటలకు గుడికి వచ్చి దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి జరుగుతుందని, అన్ని వర్గాల వారికి తమ సహకారం ఉంటుందన్నారు.
అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళతారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్నందున న్యూ ఇయర్ శుభాకాంక్షల కోసం తన వద్దకు బొకేలు, శాలువాలు తేవద్దని ఆయన సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
విదేశీ పర్యటన నుంచి ఏపీకి నారా లోకేష్
అమరావతి: మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన ముగిసింది. పది రోజులు విదేశీ పర్యటన ముగించుకొని నారా లోకేష్ నేడు అమరావతికి రానున్నారు. బుధవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి రానున్న లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నాయి.