BJP Foundation Day: అవినీతిపై పోరాటంలో హనుమంతుడే మాకు స్ఫూర్తి - పార్టీ ఆవిర్భావ వేడుకలో ప్రధాని మోదీ
BJP Foundation Day: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
BJP Foundation Day:
కార్యకర్తలతో సమావేశం..
బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం కోసం రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పార్టీ పని చేస్తోందని ప్రశంసించారు. భారతీయ జనతా పార్టీని భరత మాతకు, దేశ రాజ్యాంగానికి అంకితం చేసినట్టు వెల్లడించారు. ఇదే సమయంలో హనుమాన్ జయంతి గురించీ ప్రస్తావించారు. హనుమంతుడిలాగానే భారత్...తన బలాన్ని తాను తెలుసుకుని ముందుకెళ్తోందని అన్నారు.
"హనుమంతుడిలాగానే ఇవాళ భారత్ తన బలాన్ని తాను తెలుసుకుంది. అవినీతిపై పోరాటం చేయడంలో బీజేపీకి హనుమంతుడే స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితోనే శాంతి భద్రతలను కాపాడగలుగుతున్నాం. హనుమాన్ జీవితాన్ని ఓ సారి పరిశీలించండి. ఎంత కష్టమొచ్చినా సరే నేను చేయగలను అని ఆయన గట్టిగా నమ్మారు. అదే ఆయనకు అన్ని విజయాలు తెచ్చి పెట్టింది. మా పార్టీ, పార్టీ కార్యకర్తలు నిత్యం ఆయన నుంచి స్పూర్తి పొందుతూనే ఉంటారు. ఆయన బోధనలను అనుసరిస్తారు. సముద్రమంత సవాళ్లెన్నో భారత్‌కు ఎదురవుతున్నా... మన దేశం అన్నింటినీ తట్టుకుని నిలబడగలిగింది. ఈ హనుమాన్ జయంతి రోజున మీ అందరికీ ఆయన ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
Delhi | Today India is realizing its potential just like the power of lord Hanuman. BJP party gets inspiration from lord Hanuman to fight corruption, law & order. If we see the whole life of lord Hanuman, he had a “Can Do” attitude that helped him in bringing all kinds of… pic.twitter.com/7WXsC9I0Ws
— ANI (@ANI) April 6, 2023
ఇదే సమావేశంలో జమ్ముకశ్మీర్ విషయమూ ప్రస్తావించారు ప్రధాని. బీజేపీ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలను చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారంటూ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు చేశారు.
"ఏదో ఓ రోజు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోతుందని వాళ్లు (ప్రతిపక్షాలు) ఊహించలేదు. బీజేపీ తీసుకునే ఇలాంటి గొప్ప నిర్ణయాలు చూసి వాళ్లకు కడుపు మంటగా ఉంది. ఈ నిస్సహాయ స్థితిలో నన్ను టార్గెట్ చేశారు. మోదీ మీ గొయ్యి తవ్వుతున్నాం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లది బాద్‌షాహీ భావజాలం. వెనకబడిన వర్గాలను, పేదలను దారుణంగా అవమానించారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
సామాజికంగా అంతరాలు తొలగిపోవాలన్న ఉద్దేశంతోనే అందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నట్టు చెప్పారు ప్రధాని మోదీ. పీఎమ్ అన్న యోజన పథకం ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ లభిస్తోందని వెల్లడించారు. వీటితో పాటు జన్ ధన్ యోజన లాంటి ఇతర ప్రభుత్వ పథకాలూ వాళ్లకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని అన్నారు.
"మాది నేషన్ ఫస్ట్ నినాదం. మాకు దేశమే ముఖ్యం. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ మాది"
- ప్రధాని నరేంద్ర మోదీ
మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టిస్తుందని బీజేపీ సీనియర్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kerala Train Attack Case: కేరళ రైలు దాడి నిందితుడు మహారాష్ట్రలో అరెస్ట్