Delhi NCR AQI: ఢిల్లీలో ఆ నిర్మాణాలన్నింటిపైనా నిషేధం, దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత
Delhi NCR AQI: ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
Delhi NCR AQI:
విషమైన గాలి..
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. అక్కడి గాలి విషమైపోతోంది. ఏటా అక్టోబర్ మొదలవగానే అక్కడి ప్రజలకు ఈ కష్టాలు మొదలవుతూనే ఉంటాయి. ఈ సారి ఆ తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. Delhi-NCR ప్రాంతాల్లో చాలా చోట్ల వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. మొన్నటి వరకూ "Poor"గా నాణ్యత...ఇప్పుడు "Very Poor"గా మారినట్టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సూచిస్తోంది. కేంద్ర సంస్థ అయిన Air Quality Committee ఇప్పటికే NCR అధికారులకు పలు సూచనలు
చేసింది. Graded Response Action Plan (GRAPE)లో మొన్నటి వరకూ ఫేజ్-1 చర్యలను అమలు చేసినప్పటికీ...పరిస్థితుల్లో మార్పు కనిపించ లేదు. అందుకే...ఈ సారి ఫేజ్-3 చర్యలు చేపట్టాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సూచించింది. Central Pollution Control Board (CPCB) ప్రాంతాల వారీగా గాలి నాణ్యత ఎలా ఉందో లెక్కలతో సహా వివరించింది. ఆనంద్ విహార్‌లో 469,వాజిర్‌పూర్‌లో 419,ద్వారకాలో 425గా AQI నమోదైంది. అశోక్ విహార్‌లో 400,జహంగీప్ పురిలో 416గా వెల్లడైంది. ఫరియాబాద్‌లో అత్యంత ప్రమాదకర పరిస్థితులున్నట్టు CPCB
వెల్లడించింది. గుడ్‌గావ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రజలనూ అధికారులు అప్రమత్తం చేశారు. దీపావళి తరవాత కాలుష్య స్థాయి పెరిగిపోవటం వల్ల కట్టడి చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అత్యవసర నిర్మాణాలు తప్ప మిగతా వాటిపై నిషేధం విధించారు. NCR అంతటా ఈ ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. డిఫెన్స్, రైల్వేస్, మెట్రో పనులకు మినహాయింపు ఉంది. BS-3 పెట్రోల్, BS-4 డీజిల్ ఫోర్ వీలర్ వెహికిల్స్‌పైనా నిషేధం విధించవచ్చని అధికారులు తెలిపారు.
దీపావళి తరవాత..
ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఇప్పటికే గణనీయంగా పెరిగింది. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచాతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ ప్రకారం ఇది సోమవారం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా మారింది. ఢిల్లీ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ రెండో స్థానంలో నిలిచింది. దీపావళి రోజున ఢిల్లీలో ఏక్యూఐ 312గా నమోదైంది. నగరంలో 2018లో 281ఎక్యూఐ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఢిల్లీలో దీపావళి రోజున కాలుష్యం తక్కువగా రికార్డు అయింది. ఇది కాస్త ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం, గతేడాది దీపావళి రోజున ఢిల్లీలో 382 ఎక్యూఐ నమోదైంది. 2016లో ఏక్యూఐ 431గా ఉంది. ఏక్యూఐ వర్గీకరణ ఓసారి చూద్దాం. సున్నా నుంచి 50 మధ్య ఎక్యూఐని మంచిదిగా పరిగణిస్తారు. అదే సమయంలో 51 నుంచి 100 వరకు 'సంతృప్తికరమైనది'గా చెబుతారు. 101 నుంచి 200వరకు మధ్యస్థంగా ఉన్నట్టు లెక్క. 201 నుంచి 300వరకు ఉంటే పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు వర్గీకరించారు. ఒక నగరం ఎక్యూఐ 301 నుంచి 400 మధ్య ఉన్నట్లయితే అక్కడ గాలి చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. 401 నుంచి 500 వరకు ఉంటే 'తీవ్రమైనది'గా పరిగణిస్తారు.
Also Read: Halloween stampede: హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి, తొక్కిసలాటలో 149 మంది మృతి - అసలేం జరిగిందంటే !