Halloween stampede: హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి, తొక్కిసలాటలో 149 మంది మృతి - అసలేం జరిగిందంటే !
దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరగడంతో 149 మంది ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ కొరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. రాజధాని సియోల్ నగరంలో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరగడంతో 149 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిలో 20 నుంచి 30 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. సియోల్ లోని ఇటావాన్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ వేడుకలు నిర్వహించారు. అప్పటివరకూ ఉత్సాహంగా సాగిన హాలోవీన్ సంబురాలు పెను విషాదాన్ని నింపాయి. చిన్నా పెద్దా అనే వ్యత్యాసం లేకుండా ఒక్కసారిగా భారీ సంఖ్యలో హాలోవీన్ సంబరాల్లో ప్రజలు పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో అధికంగా యువత ఉన్నారని అధికారులు గుర్తించారు. తొక్కిసలాట ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
తొక్కిసలాట జరగడానికి కారణాలివే..
కరోనా వ్యాప్తి కారణంగా గత మూడేళ్లుగా హాలోవీన్ సెలబ్రేషన్స్ జరపలేదు. కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో మూడేళ్ల తరువాత తొలిసారి హాలోవీన్ వేడుకలు నిర్వహించారు. మూడేళ్ల తరువాత సెలబ్రేషన్స్ చేయడంతో యువత అధిక సంఖ్యలో హాలోవీన్ సంబరాలలో పాల్గొంది. సియోల్ లోని ఇటావాన్ ప్రాంతంలో శనివారం రాత్రి వేడుకలు నిర్వహించారు. ఒకేసారి భారీ సంఖ్యలో ప్రజలు వేడుకలలో పాల్గొనడం, ఇరుకైన వీధిలో వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది. ఆందోళనకు గురైన వారు అక్కడి నుంచి త్వరగా బయటపడాలని ప్రయత్నించడంతో మరణాలు సంభవించాయి. ముఖాలకు మాస్కులు ధరించి, రంగులు పూసుకుని భారీ సంఖ్యలో యువత హాలోవీన్ వేడుకలలో పాల్గొన్నారు. తొక్కిసలాట గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటీన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
#SouthKorea | Morning visuals from the spot of the deadly stampede in Seoul that broke out during Halloween festivities yesterday leaving 149 dead and injuring scores of people till now
— ANI (@ANI) October 30, 2022
(Source: Reuters) pic.twitter.com/9REYUhFJKl
సీపీఆర్ చేసిన రెస్క్యూ టీమ్..
స్పృహతప్పి పడిపోయిన వారిని అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి రెస్క్యూ టీమ్ సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేసింది. సత్వరమే సీపీఆర్ చేసి కొంత మంది ప్రాణాలను కాపాడారు రెస్క్యూ టీమ్. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచమంతా ఈ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తూనే గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. సినీ సెలబ్రిటీ రావడంతో ఒక్కసారిగా హాలోవీన్ లో పాల్గొన్న యువత భారీ సంఖ్యలో చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగి ఉండొచ్చునని వాదన వినిపిస్తోంది. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన భారీ వేడుక నిర్వహించడం, అందులోనూ మూడేళ్లు ఇళ్లకే పరిమితమైన యువత లక్షలాదిగా ఈవెంట్లో పాల్గొనడంతో తొక్కిసలాటకు దారితీసిందని స్థానిక పోలీసులు, అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Video shows many people receiving CPR after stampede at Halloween party in Itaewon, Seoul; number of victims not yet known
— BNO News (@BNONews) October 29, 2022
⚠️: Viewer discretion is advised pic.twitter.com/H6iajwMxJ6