Pennsylvania: ఆమె దగ్గినందుకు రూ.26 లక్షలు నష్టం.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
పెన్సీల్వినియాకు చెందిన మహిళ ఓ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేయడానికి వెళ్లింది. ఆమె అకస్మాత్తుగా దగ్గడం ప్రారంభించింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మూర్ఖులకు ఈ ప్రపంచంలో కొరత లేదు. సమాజంతో సంబంధం లేకుండా బతికేసే ఇలాంటి మూర్ఖుల వల్లే.. వైరస్‌లు, బ్యాక్టీరియాలు.. రకరకాల వ్యాధులు ప్రభలుతున్నాయి. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ప్రాణాలు వదిలారో తెలిసిందే. ఇండియాలో వ్యాపించిన సెకండ్ వేవ్ వల్ల దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆ చేదు అనుభవాలు ప్రజల్లో ఏ మాత్రం మార్పు తీసుకురాలేదు. వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని తెలిసినా.. మాస్కులు లేకుండా తిరుగుతూ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమని తాము ప్రమాదంలోకి నెట్టుకోవడమే కాకుండా తమ కుటుంబాన్ని, స్నేహితులకు సైతం ప్రాణహాని కలిగేలా ప్రవర్తిస్తున్నారు.
పెన్సీల్వినియాకు చెందిన ఈ మహిళ కూడా ఆ కోవకు చెందినదే. మార్గరెట్ అన్ కిర్కో అనే 37 ఏళ్ల మహిళ ఓ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేయడానికి వెళ్లింది. మరి ఆమెకు ఏ బుద్ధి పుట్టిందో ఏమో.. అకస్మాత్తుగా దగ్గడం ప్రారంభించింది. ఆ తర్వాత.. ‘‘నాకు కరోనా వైరస్ ఉంది’’ అని అరుస్తూ.. ఆహార ఉత్పత్తులపై ఉమ్ములు వేసింది. ఆమె చేసిన పనికి ఆ మార్కెట్లో ఉన్న తోటి వినియోగదారులు, సిబ్బంది హడలిపోయారు. వెంటనే సూపర్ మార్కెట్ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
ఆమె చేసిన పనికి అక్కడి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకడుగు వేశారు. వారిలో నమ్మకం కలిగించేందుకు సూపర్ మార్కెట్ నిర్వాహకులు.. మొత్తం ఆహార ఉత్పత్తుల స్టాక్ మొత్తాన్ని బయట పడేశారు. ఆ ఆహారాన్ని తినడం వల్ల తమ వినియోగదారులు వైరస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని, అందుకే స్టాక్ మొత్తాన్ని పడేయాల్సి వచ్చిందని సూపర్ మార్కెట్ నిర్వాహకులు తెలిపారు. ఆమె మూర్ఖత్వం వల్ల 35 వేల డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.25.96 లక్షలు) విలువ చేసే ఆహారం వృథా అయ్యింది.
మార్చి నెలలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇటీవలే కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కిర్కో మాట్లాడుతూ.. ఆ రోజు తాను మద్యంలో మత్తులో ఉన్నానని తెలిపింది. దయచేసి క్షమించాలని కోర్టును కోరింది. అయితే, కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆమెకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అంతేగాక.. సూపర్ మార్కెట్‌కు 30 వేల డాలర్లను జరిమానాగా చెల్లించాలి ఆదేశించింది. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత సుమారు ఎనిమిదేళ్లు ప్రొబేషన్‌లో ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read: రియల్ పక్షిరాజా.. వీడియో తీస్తుంటే ఫోన్ ఎత్తుకెళ్లిపోయిన చిలుక, కెమేరాకు చిక్కిన ‘బర్డ్ వ్యూ’
ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ ఫేస్‌బుక్ ద్వారా వినియోగదారులతో పంచుకుంది. ‘‘ఓ మహిళ సూపర్ మార్కెట్లోకి వచ్చి.. కావాలనే దగ్గడం ప్రారంభించింది. తాజా ఆహార ఉత్పత్తులు, బేకరీ, మాంసం, నిత్యవసర వస్తువులను ఉంచే సెక్షన్‌లో గట్టిగా దగ్గింది. ఆమె సరదాగానే అలా చేస్తోందని భావించాం. కానీ, ఆమెకు కరోనా ఉన్నట్లయితే వినియోగదారులకు ప్రమాదమని భావించాం. అందుకే ఆ ఉత్పత్తులన్నీ పడేయాల్సి వచ్చింది. ఇందుకు హ్యాన్‌ఓవర్ టౌన్‌షిప్ హెల్త్ ఇన్స్‌పెక్టర్ కూడా సహకరించారు. అన్నీ పడేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని సానిటైజర్లతో శుభ్రం చేశాం’’ అని పేర్కొన్నారు. మన దేశంలో కూడా అలాంటి ఆకతాయిలకు ఇలాంటి శిక్షలు విధిస్తే.. కరోనాను కొంతవరకైనా కంట్రోల్ చేయొచ్చు కదూ.
Also Read: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?