Odisha Train Accident: రైల్వేలో 3 లక్షలకు పైగా పోస్ట్‌లు ఖాళీ, ప్రమాదాలకు ఇదీ ఓ కారణమే!
Odisha Train Accident: ఇండియన్ రైల్వేల్‌లో 3 లక్షలకు పైగా పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్టు గతంలోనే కేంద్రం వెల్లడించింది.
Odisha Train Accident:
3.12 లక్షల ఖాళీలు..
ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ భారత్ సొంతం. కానీ ఈ భారీతనానికి సరిపడ వర్క్‌ఫోర్స్ మాత్రం లేదు. స్వయంగా రైల్వేశాఖ వెల్లడించిన విషయమిది. వర్క్‌లోడ్ పెరుగుతోంది తప్ప సిబ్బంది సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇప్పటికీ కొన్నికీలక పోస్ట్‌లు ఖాళీగానే ఉన్నాయి. ప్రమాదాలు జరగడానికీ ఇదీ ఓ కారణమే అన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన లెక్కల ప్రకారం...ప్రస్తుతానికి మన ఇండియన్ రైల్వేస్‌లో దాదాపు 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్ట్‌లు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది మార్చిలోనే ఈ లెక్కలు చెప్పారాయన. అప్పటి నుంచి వీటి భర్తీ కూడా చేయలేదు. ఇప్పటికీ అవి ఖాళీగానే ఉన్నాయి. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు. 2022 డిసెంబర్ 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నాన్ గెజిటెడ్ విభాగంలో 3 లక్షల పోస్ట్‌లు భర్తీ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా నార్త్ జోన్‌లోనే ఎక్కువగా 38,754 ఖాళీలున్నాయి. వెస్టర్న్ జోన్‌లో 30,476, ఈస్టర్న్ జోన్‌లో 30,141, సెంట్రల్ జోన్‌లో 28 వేల 650 ఖాళీలున్నట్టు చెప్పారు అశ్వినీ వైష్ణవ్. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అంటే...ఇంజనీర్స్, టెక్నీషియన్స్, క్లర్క్‌లు, స్టేషన్ మాస్టర్‌లు, టికెట్ కలెక్టర్‌లు. ఈ పోస్ట్‌లు ఖాళీగా ఉండటం వల్ల ఉన్న వారిపైనే పని భారం పెరుగుతోంది.
పెరుగుతున్న వర్క్‌లోడ్
టికెట్ బుకింగ్ విభాగంలోనూ సిబ్బంది చాలడం లేదు. ఫలితంగా...ఇది కూడా సవాలుగా మారుతోంది. కొంత మందైతే రోజుకి 16 గంటల పాటు పని చేస్తున్నారు. కనీసం సెలవులు పెట్టడానికి కూడా వీల్లేనంత బిజీగా ఉంటున్నారు. కొందరు రైల్వేలోనే వేరే డిపార్ట్‌మెంట్‌కి మారేందుకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్లకు ప్రిపరేషన్ టైమ్ కూడా దొరకనంత పని ఉంటోంది. ఇక రైల్ సేఫ్‌టీ విభాగంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతానిది దాదాపు లక్షా 40వేల ఖాళీలున్నాయి. ఇదంతా రైల్వే ప్రైవేటీకరణ పాలసీల వల్ల వచ్చిన సమస్యలేనని కొందరు వాదిస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండియా రవాణాకి వెన్నెముక లాంటి రైల్వే నెట్‌వర్క్‌లో ఇన్ని పోస్ట్‌లు ఖాళీగా ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే రిక్రూటింగ్ సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ఉన్న ఖాళీల్లో దాదాపు 25% మేర ఖాళీలు...భద్రతా విభాగంలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా మోదీ ప్రభుత్వం ప్రమాదానికి ఏవేవో కారణాలు చెబుతోందన్న వాదనలూ ఉన్నాయి. ఈ విమర్శలు, వివాదాల సంగతి పక్కన పెడితే....ఖాళీలున్నాయన్న మాట మాత్రం వాస్తవం. రైల్వేలో సంస్కరణలపై దృష్టి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ "ఖాళీల" విషయాన్ని పట్టించుకోవాలి. వీలైనంత త్వరగా ఈ పోస్ట్‌లు భర్తీ చేస్తే కొంత వరకూ ప్రమాదాలను అడ్డుకునేందుకు ఆస్కారముంటుంది. మరి మోదీ సర్కార్ సవాలుని ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read: Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు