NTA New Chief: నీట్, నెట్ పేపర్ లీక్ ఎఫెక్ట్ - ఎన్‌టీఏ చీఫ్ పై వేటు, కొత్త డీజీగా విశ్రాంత ఐఏఎస్
NTA New Chief Pradeep Karola| ఎన్ టీ ఏ ఛీఫ్ సుబోధ్ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రదీప్ ఖరోలా నియమితులయ్యారని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
Pradeep Karola NTA New Chief | పేపర్ లీకులు, గ్రేస్ మార్కులు, ఒకే సెంటర్ లో పలువురికి మొదటి ర్యాంకులు.. ఇలా నీట్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్మకున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ టీ ఏ) ఛీఫ్ సుబోధ్ కుమార్‌పై వేటు వేసింది. ఆయనను NTA బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
నీట్, నెట్ పరీక్షల నిర్వహణపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎన్‌టీఏ ద్వారా నిర్వహించే పరీక్షలు పారదర్శకంగా సజావుగా సాగాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఇన్ పుట్స్ ఇచ్చేందుకు మాజీ ఇస్రో చీఫ్ కే రాధాకృష్ణన్ సారధ్యంలో ఏడుగురు సభ్యుల కమిటీని శనివారం సాయంత్రం నియమించిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అనంతరం మరోె ప్రకటన చేసింది.
తాజా ఆరోపణలతో ఎన్ టీ ఏ ఛీఫ్ సుబోధ్ కుమార్‌పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారిని నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ కొత్త చీఫ్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రదీప్ కరోలా నియమితులయ్యారు. గతంలో ఓ బాధ్యత నిర్వహిస్తోన్న ఆయన ఎన్‌టీఏ పరీక్షా విభాగానికి సైతం డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
1985 బ్యాచ్ కర్ణాటక క్యాడర్
గతంలో సివిల్ ఏవియేషన్ సెక్రటరీగా పనిచేసిన ప్రదీప్ కరోలా.. 2022 నుంచి బారత వాణిజ్య ప్రచార సంస్థ (ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీ అండ్ ఎండీ)గా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన కరోలా 2017లో ఎయిరిండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఎన్నికయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్నీ (ఎన్ టీ ఏ ) చీఫ్ గా ఆయన నియామకాన్ని కేంద్ర కేబినెట్ లోని నియామకాల కమిటీ ఆమోదించిందని కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఆయన అదనపు బాధ్యతలపై ఎన్‌టీఏ డీజీగా కొనసాగుతారని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Pradeep Singh Kharola has been given additional charge of the post of Director General, National Testing Agency (NTA), Ministry of Education. pic.twitter.com/owLKo75ApU
— ANI (@ANI) June 22, 2024
వ్యవస్థ మొత్తాన్ని మార్చాలి..
ఎన్‌టీఏ చీఫ్ సుబోధ్ కుమార్ ని ఆయన బాధ్యతల నుంచి తప్పించడంపై కాంగ్రెస్ లీడర్ సురేంద్ర రాజ్ పుత్ స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్‌టీఏ చీఫ్ ని తప్పిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. వ్యవస్థలో వేళ్లూనుకు పోయిన ఆ భావజాలంతోనే అసలైన సమస్య అంతా. అన్నింటికీ ఎవరో ఒకర్ని బాధ్యుల్ని చేయడం సరికాదు. ఇది ఆయన ఒక్కరి వల్ల జరిగిన తప్పు కాదు. పేపర్ లీకేజీ ఈ ఒక్కచోటు నుంచే కాదు చాలా చోట్ల నుంచి జరుగుతోంది. ఈ వ్యవస్థ మొత్తం ఇలాగే ఉంది. మీరు మార్చాలంటే వ్యవస్థ మొత్తాన్ని మార్చాలి’’ అని అన్నారు.
నీట్ పరీక్ష వాయిదా..
జూన్ 23న దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఎన్‌టీఏ పై వస్తోన్న విమర్శల నేపథ్యంలో దు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.