Noida Twin Tower Demolition: దుమ్ము తేలిపోవటానికే పావుగంట పడుతుందట, ట్విన్ టవర్స్ కూల్చివేతలో ఎన్నో ఆసక్తికర విషయాలు
Noida Twin Tower Demolition: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి.
Noida Twin Tower Demolition:
ఢిల్లీలోని నోయిడాలో సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంతా సిద్ధమవుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు 9 సెకన్లలో ఈ భవంతులు కూల్చివేయనున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లోని వారిని వేరే చోటకు తరలించారు. చుట్ట పక్కల ఉన్న బిల్డింగ్‌లు డ్యామేజ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌నూ డైవర్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌ప్లోజన్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. అవేంటో చూద్దాం.
ట్విన్ టవర్ కూల్చివేత-ఆసక్తికర అంశాలు
1. ఈ రెండు టవర్స్‌ని కూల్చేందుకు మొత్తం 3,700 కిలోల బరువైన ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ టవర్స్‌లోని 7000 హోల్స్‌లో ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అమర్చారు. 20 వేల సర్క్యూట్‌లు ఏర్పాటు చేశారు. ట్రిగ్గర్ చేసినప్పుడు ఉన్నట్టుండి ఆ పిల్లర్స్ నిలువునా కూలిపోతాయి. దీన్నే "వాటర్ ఫాల్ టెక్నిక్" (Waterfall technique) అంటారు.
2. ప్రాజెక్ట్ ఇంజనీర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ కూల్చివేత 9 సెకన్లలో పూర్తవుతుంది. ఇది కూలిపోయిన తరవాత వచ్చే దుమ్ము అంతా తేలిపోవటానికి కనీసం 12 నిముషాలు పడుతుంది. ఒకవేళ గాలి బాగా వీస్తే ఇంకా ఎక్కువ సమయమే పడుతుండొచ్చు. దాదాపు 55 వేలటన్నుల మేర శిథిలాలు పోగవుతాయని అంచనా. వీటిని క్లియర్ చేయటానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ శిథిలాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే డంప్ చేయనున్నారు.
3. ఈ ఎక్స్‌ప్లోజన్ జరిగిన సమయంలో కొన్ని సెకన్ల పాటు దాదాపు 30 మీటర్ల రేడియస్ వరకూ వైబ్రేషన్స్ వస్తాయి. ఈ వైబ్రేషన్స్ మాగ్నిట్యూడ్ సెకన్‌కి 30 మిల్లీమీటర్ల వరకూ ఉంటుంది. ఇది దాదాపు రిక్టర్ స్కేల్‌పై 0.4తో సమానం. రిక్టర్ స్కేల్‌పై 6 వరకూ వచ్చినా గట్టిగా నిలబడేంత దృఢంగా ఈ ట్విన్ టవర్స్‌ని నిర్మించారు.
4. పరిసర ప్రాంతాల్లోని 7 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. దాదాపు 2,500 వాహనాలను దూరంగా పార్క్ చేశారు. సాయంత్రం 4 గంటల వరకూ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు గ్యాస్, విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. సాయంత్రం 5.30 నిముషాల తరవాత ఎవరి ఇళ్లలోకి వాళ్లు వెళ్లిపోవచ్చని అధికారులు వివరిస్తున్నారు.
5. ఈ టవర్స్ ఉన్న 450 మీటర్ల పరిధిలో "నో గో జోన్" గా ప్రకటించారు. దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. బ్లాస్ట్ జరిగే పావుగంట ముందు నుంచే..అంటే 2.15 కి ముందు, బ్లాస్ట్ జరిగిన తరవాత అంటే 2.45 వరకూ దారి మూసివేస్తారు. సెక్టార్ 39Aలోని ఈ ట్విన్ టవర్స్‌కు చేరుకునే దారుల్లోని ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయనున్నారు.
6. ఈ టవర్స్‌కు 8 మీటర్ల దూరంలోనే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. వాటితో పాటు 12 మీటర్ల రేడియస్‌లో మరికొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ ప్రత్యేక క్లాత్‌తో కవర్ చేశారు. ట్విన్ టవర్స్ కూల్చినప్పుడు వచ్చే దుమ్ము ఆ భవంతులపై పడకుండా ఇలా కవర్ చేయనున్నారు.
7. రూ.100కోట్ల ఇన్సూరెన్స్ పాలసీతో ఈ ఎక్స్‌ప్లోజన్ చేయనున్నారు. పరిసర ప్రాంతాల్లోని బిల్డింగ్‌లకు ఏమైనా డ్యామేజ్ జరిగితే ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ప్రీమియంతో పాటు ఇతర ఖర్చులన్నీ సూపర్‌టెక్ కంపెనీయే భరించాల్సి ఉంటుంది. ఈ డిమాలిషన్ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.20 కోట్లు ఖర్చు కానుంది. మొత్తం నష్టం రూ.50 కోట్లు అని అంచనా.
8. ముంబయికి చెందిన Edifice Engineering సంస్థ ఈ కూల్చివేతను చేపట్టనుంది. దాదాపు 9 ఏళ్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్న తరవాత చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ ఆవరణలో ఈ టవర్స్‌ను అక్రమంగా నిర్మించారన్న కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా వీటిని కూల్చివేయనున్నారు. ఇందుకోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నోయిడా అథారిటీస్ ఈ బ్లాస్ట్‌ను పర్యవేక్షించనున్నాయి.
9. నిజానికి మొత్తం 40 అంతస్తులు నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ..కోర్ట్ ఆర్డర్ల వల్ల 32 ఫ్లోర్లు మాత్రమే నిర్మించగలిగారు. వాటిలో కొన్ని ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ఒక టవర్‌లో 32 అంతస్తులు మరో టవర్‌ల 29 అంతస్తులున్నాయి. వీటిలో దాదాపు మూడింట రెండొంతుల ఫ్లాట్‌లు అమ్ముడయ్యాయి. అయితే వీటిని కొనుగోలు చేసిన వారికి మనీ రీఫండ్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
10. సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ వాసులు 2012లో కోర్టుకు వెళ్లారు. అంతకు ముందు గార్డెన్ అని చెప్పిన ప్లేస్‌లోనూ బిల్డింగ్‌లు కట్టేందుకు ప్లాన్‌ను రివైజ్ చేయటంపై వాళ్లు కోర్టుని ఆశ్రయించారు. వీటికి అక్రమంగా అనుమతులు వచ్చాయని గుర్తించిన అధికారులు..కొందరిపైచర్యలు తీసుకున్నారు. అలహాబాద్ హైకోర్ట్ 2014లోనే ఈ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పునిచ్చింది. ఆ తరవాతే ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.