(Source: ECI/ABP News/ABP Majha)
Naveen Patnaik : ఐఏఎస్‌కు ఇలా వాలంటరీ రిటైర్మెంట్ - అలా కేబినెట్ హోదాతో పదవి ! వివాదాస్పదమయిన ఒరిస్సా సీఎం నిర్ణయం
నవీన్ పట్నాయక్ అత్యంత నమ్మకస్తుడైన ఐఏఎస్‌తో రాజీనామా చేయించి వెంటనే కేబినెట్ ర్యాంక్‌తో పదవి ఇచ్చారు. ఒడిషా అసెంబ్లీకి వచ్చే మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
Naveen Patnaik : ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఆయన తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ప్రభుత్వంలో పని చేస్తున్న ఓ ఐఏఎస్ అధికారితో స్వచ్చంద పదవీ విరమణ చేయించి.. తర్వాత రోజునే కేబినెట్ ర్యాంక్ తో పదవి కట్టబెట్టేశారు. ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. పదవి విరమణ చేసి.. పదవి దక్కించుకున్న అధికారి వీకే పాండియాన్. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేటు సెక్రటరీగా పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు.
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒకరోజు తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంఇ 5టీ(ట్రాన్స్‌ఫౄర్మేషనల్ ఇనిషియేటివ్), ‘నబిన్ ఒడిశా’ పథకానికి చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిష్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది . దీంతో పాండియన్ నేరుగా ముఖ్యమంత్రి కింద పని చేయనున్నారు. వీకే పాండియన్ సీఎం పట్నాయక్‌కు సన్నిహితుడిగా పాండియన్ పేరు తెచ్చుకున్నారు.
ఒడిశా క్యాడర్‌లో 2000 ఏడాది బ్యాచ్‌కు చెందిన ఆ ఐఏఎస్ అధికారి పేరు వీకే పాండియన్. ఆయన ధర్మగఢ్ సబ్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2005లో మయూర్‌భంజ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2007లో గంజాం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నమ్మకాన్ని చూరగొన్నారు. దాంతో 2011లో ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆ తర్వాత సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా పదోన్నతి పొందారు.
ఆయన ఐఏఎస్ అధికారిగా కంటే.. బీజేడీ, నవీన్ పట్నాయక్ తరపున రాజకీయాలు ఎక్కువగా చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. ఓ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన పాండియన్.. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి 190 సమావేశాలు నిర్వహించారు. గత కొద్దికాలంగా పాండియన్ రాజకీయాల్లోకి వస్తారని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కీలక బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వస్తున్నాయి. వాటికి తగ్గట్టే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన అభ్యర్థనకు అక్టోబర్ 23న ఆమోదం లభించింది. ఆ తర్వాత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రప్రభుత్వానికి చెందిన 5T, నబిన్ ఒడిశా స్కీమ్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ గ్రీవెన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలు కట్టబెట్టింది.
ఈ అంశం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. వీకే పాండియన్ ఐఏఎస్‌గా రాజీనామా చేసినందున ఆయన సొంత రాష్ట్రం వెళ్లిపోవాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒడిషా ప్రజలు ఆయనను అంగీకరించరని అంటున్నారు. నవీన్ పట్నాయక్ అవివాహితుడు. ఆయన బంధువులు కూడా ఒడిషాలో ఉండరు. దీంతో వీకే పాండియన్ పై ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని భావిస్తున్నారు.