26/11 Mumbai Attack: ఆ మారణహోమం నుంచి పాఠం నేర్చుకున్న భారత్, ఉగ్రపోరులో మారిన వ్యూహాలు
26/11 Mumbai Attack: 26/11 దాడుల తరవాత ఉగ్రపోరులో భారత్ వ్యూహాలు మార్చింది.
26/11 Mumbai Attack:
14 ఏళ్లు..
ముంబయిలో తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి 14 ఏళ్లు. దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని భయంకరమైన సంఘటన అది. దేశమంతా వణికిపోయిన దారుణమది. 2008 నవంబర్ 26న జరిగిన ఈ మారణహోమం...ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. 166 మంది ప్రాణాలను బలిగొంది. ఈ దాడి తరవాత ఉగ్రవాదంపై భారత్ కొనసాగిస్తున్న పోరాటం తీరు పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ
వచ్చింది. దాదాపు 4 రోజుల పాటు కొనసాగిన ఆ ఉగ్రదాడి...భారత రక్షణ వ్యవస్థలోని లూప్‌హోల్స్‌ను బయటపెట్టింది. అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తక్షణమే స్పందించి..ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. దేశ అంతర్గత భద్రతను పటిష్ఠం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల తీరప్రాంతాల్లోని నగరాల్లో భద్రతలో లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అందుకే..అప్పటికప్పుడు తీర ప్రాంతాల రక్షణ నిర్వహణలో సంస్కరణలు తీసుకొచ్చారు. తీర ప్రాంతాల్లో నిఘా పెంచేందుకు సాగర్ ప్రహరి బల్ (SPB) బలగాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు Fast Interceptor Crafts (FIC)ను అందుబాటులోకి తీసుకొచ్చింది..అప్పటి ప్రభుత్వం. 26/11 దాడి జరిగినప్పటి నుంచి గతేడాది నవంబర్ వరకూ... 300 సార్లు తీర ప్రాంతాల్లో విన్యాసాలు చేపట్టారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ వీటికి నేతృత్వం వహించింది.
ఎన్నో సంస్కరణలు..
2018లో సముద్ర జలాలపై నిఘా ఉంచాలన్న ఉద్దేశంతో..కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. 2019 నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం National Investigation Agency (NIA) చట్టాన్ని ఆమోదించింది. అప్పుడే NIAని ఏర్పాటు చేసింది. ఉగ్రవాదానికి సంబంధించిన ఏ కేసునైనా
పరిశీలించేందుకు ఈ సంస్థకు పూర్తి అధికారాలు అప్పగించింది. ఇక ముంబయిలోనూ పోలీసింగ్ విధానంలో చాలా మార్పులు వచ్చాయి. మునుపటి కన్నా..అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులోకి తెచ్చుకున్నారు. ఇతర భద్రతా సంస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ నిఘా పెంచారు. ఇతర దేశాల భద్రతా సంస్థలతో ఇంటిలిజెన్స్ షేరింగ్ విషయంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించింది. 2008 నాటి పరిస్థితులతో పోల్చుకుంటే..ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. ఉగ్రదాడులు జరిగినా వెంటనే స్పందించి ముష్కరుల ఆట కట్టించేందుకు వీలుగా...పలు రాష్ట్రాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) హబ్స్‌ను ఏర్పాటు చేశారు.
ఇలా జరిగింది..
2008, నవంబర్ 26 రాత్రి 8 గంటల ప్రాంతంలో 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు స్పీడ్‌బోట్లలో ముంబయిలోని కొలాబా తీర ప్రాంతానికి చేరుకొన్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లోకి ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు. ఏకే-47 తుపాకులతో ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు ఉరితీశారు.
Also Read: ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం