Moscow Attack: మాస్కో ఉగ్రదాడి ఘటనలో 11 మంది అరెస్ట్, వీళ్లలో నలుగురు ఉగ్రవాదులు!
Moscow Concert Hall Attack: మాస్కో ఉగ్రదాడితో సంబంధం ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Moscow Concert Hall Attack News: రష్యాలోని మాస్కోలో కాన్సర్ట్ హాల్‌పై జరిగిన దాడితో సంబంధం ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రష్యన్ మీడియా ఈ విషయం వెల్లడించింది. ఈ అరెస్ట్ అయిన 11 మందిలో నలుగురు ఉగ్రవాదులున్నారు. వీళ్లు పారిపోతుండగా పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇప్పటి వరకూ ఈ దాడిలో 90 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మార్చి 22న రాత్రి కాన్సర్ట్ హాల్‌లో అంతా కిక్కిరిసిపోయి ఉండగా కొందరు దుండగులు రష్యా మిలిటరీ దుస్తుల్లో లోపలికి వచ్చారు. వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ధాటికి పైకప్పు కూలిపోయింది. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిసినా...ప్రభుత్వం మాత్రం 60 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి క్రమంగా ఈ సంఖ్య పెరుగుతోంది. దాదాపు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడి చేసింది తామేనంటూ ఐసిస్ ఇప్పటికే ప్రకటించుకుంది. కాల్పులు జరపడంతో పాటు గ్రనేడ్‌లు విసిరింది. ఫలితంగా ఒక్కసారిగా హాల్ అంతా మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పేందుకు మూడు హెలికాప్టర్లను తీసుకురావాల్సి వచ్చింది. కాల్పులు జరిపిన సమయంలో కొందరు కుర్చీల వెనక దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఈ దాడుల్ని ఖండించాయి. అటు అమెరికా కూడా గట్టిగానే స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఈ ఘటనకు సంబంధం ఉందని తాము భావించడం లేదని స్పష్టం చేసింది. రెండు వారాల క్రితమే తాము ఉగ్రదాడి గురించి రష్యాని హెచ్చరించినట్టు గుర్తు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఖండించారు. బాధితుల కుటుంబ సభ్యులకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని విధాలుగా రష్యాకి సహకరిస్తామని ప్రకటించారు.