Morbi Bridge Collapse: మోర్బి కేసులో విచారణ ఎలా జరుగుతోందో పరిశీలించండి, గుజరాత్ హైకోర్టుకి సుప్రీం ఆదేశాలు
Morbi Bridge Collapse: మోర్బి కేసులో విచారణ ఎలా కొనసాగుతోందో పరిశీలించాలని సుప్రీం కోర్టు గుజరాత్ హైకోర్టుకి ఆదేశాలిచ్చింది.
Morbi Bridge Collapse:
విచారణపై ఆరా తీయాలని ఆదేశం..
గుజరాత్ మోర్బి కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ కేసులో విచారణ ఎలా జరుగుతోందో పరిశీలించాని గుజరాత్ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన మిగతా అన్ని వివరాలపైనా దృష్టి సారించాలని తేల్చి చెప్పింది. అడ్వకేట్ విశాల్ తివారీ వేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం...ఈ వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం...పూర్తి బాధ్యతను గుజరాత్ హైకోర్టుకే అప్పగించింది. ఇలాంటి ప్రమాదాలు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు అడ్వకేట్ విశాల్. నవంబర్ 1న అత్యవసర పిటిషన్‌ల జాబితాలో దీన్ని చేర్చారు. త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు అప్పుడే హామీ ఇచ్చింది. "దాదాపు దశాబ్ద కాలంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం, పనిపై శ్రద్ధ లేకపోవడం లాంటి కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లుతోంది. వీటిని తప్పకుండా అరికట్టాల్సిందే" అని పిటిషన్‌లో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పిటిషన్‌లో కోరారు విశాల్ తివారి. అంతే కాదు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చారిత్రక కట్టడాలపై దృష్టి సారించి, వాటిని సురక్షితంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. "మోర్బి ప్రమాదం దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంత నష్టం కలిగిందో తెలిసొచ్చింది. ప్రైవేట్ ఆపరేటర్లకు మెయింటేనెన్స్ బాధ్యతలు ఇవ్వడం...ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే" అని ఆరోపించారు.
వాదనలు..
అక్టోబర్ 30వ తేదీన గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటనపై ఇంకా వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ వేగంగా కొనసాగుతోంది. అయితే...తప్పు మీదంటే మీది అని మున్సిపాల్టీ అధికారులు, మేనేజ్‌మెంట్ సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే కాలం అంతా గడిచిపోతోంది. ముఖ్యంగా మోర్బి మున్సిపాల్టీ...తప్పంతా అజంతా మానుఫాక్చరింగ్ లిమిటెడ్ (ఒరెవా గ్రూప్)దేనని తేల్చి చెబుతోంది. ఎలాంటి ఫిట్‌నెస్ టెస్ట్ చేయకుండానే బ్రిడ్జ్‌ను తెరిచారని ఆరోపిస్తోంది. గుజరాత్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేసింది. ఈ ఘటనలో 135 మంది మృతి చెందారు. ఈ కేసుని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపడుతోంది. "మోర్బి మున్సిపాలిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, ఎలాంటి అప్రూవల్ లేకుండానే వంతెనకు మరమ్మతులు చేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రాకముందే బ్రిడ్జ్‌ని తెరిచారు. దాని కెపాసిటీని కూడా సరైన విధంగా అంచనా వేయలేకపోయారు" అని మోర్బి మున్సిపాల్టీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ విచారణ జరిగే సమయంలో కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. "ఇంత ముఖ్యమైన పనిని చేసేందుకు కేవలం ఒకటిన్నర పేజీల్లోనే అగ్రిమెంట్ ఎలా చేశారు..? ఎలాంటి టెండర్ వేయకుండానే నేరుగా అజంతా కంపెనీకే ఈ పని అప్పగించటం వెనక అర్థమేంటి..?" అని ప్రశ్నించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరు విభాగాల నుంచి సమాధానాలు కావాలని కోర్టు ఆదేశించింది.