Mahakumbh 2025: మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నారా - బస్సులు, రైళ్లు, విమాన ఏర్పాట్లపై పూర్తి వివరాలివే!
Mahakumbh 2025: జనవరి 13న ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారతీయ రైల్వేలు, విమానయాన సంస్థలు విస్తృతమైన రవాణా ఏర్పాట్లు చేశాయి.

Mahakumbh 2025: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహాకుంభమేళా ఈ నెల 13న ప్రారంభం కానుంది. ఈ మహా వేడుక ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజు ముగుస్తుంది. ఇది చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంతో పాటు, హిందూ విశ్వాసంలో లోతుగా పాతుకుపోయిన ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక వేడుకగా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ ఉత్సవాలకు సుమారు 40 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నందున, 55 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.
మహా కుంభమేళా 2025కు వెళ్లాలనుకుంటోన్న భక్తుల కోసం ఇప్పటికే వేలాది బస్సులు, రైలు సర్వీసులు, విమాన సౌకర్యాలను పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (UPSRTC), భారతీయ రైల్వేలు, వివిధ విమానయాన సంస్థలు పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం విస్తృత ఏర్పాట్లు చేశాయి. కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే యాత్రికుల కోసం అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహా కుంభమేళాకు బస్సు సర్వీసులు
సురక్షితమైన రవాణా కోసం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు 7,550 బస్సులను నడుపుతోంది. దీంతో పాటు అదనంగా, ఈవెంట్ సైట్‌కి సులభంగా యాక్సెస్ కోసం 550 కొత్త షటిల్ బస్సులు ప్రయాగ్‌రాజ్ సరిహద్దుల వద్ద ఉంచుతారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుండి బస్సులు ప్రయాగ్‌రాజ్‌ను నేరుగా కలుపుతాయి. దీని వల్ల దేశం నలుమూలల నుండి యాత్రికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడం చాలా సులభమవుతుంది. కుంభమేళాకు రావడానికి 3 కోట్లకు పైగా భక్తులు యూపీఎస్ఆర్టీసీ (UPSRTC) బస్సులను ఉపయోగిస్తారని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజూ 7 నుంచి 8 లక్షల మంది యాత్రికులను సురక్షితమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కీలక పాత్ర పోషించనున్న రైల్వేలు
కుంభమేళా కోసం భారీ రవాణా అవసరాలను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ప్రయాగ్‌రాజ్‌కు, దగ్గర్లోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా సుమారు 13వేల ప్రత్యేక రైళ్లు నడుపుతోంది ఇండియన్ రైల్వే. ప్రయాగ్‌రాజ్ భారతదేశం అంతటా ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉండగా, ఈవెంట్ కోసం 50 అదనపు నగరాలు ప్రత్యేక రైళ్లతో అనుసంధానించి ఉంటాయి. ఉదాహరణకు, ముంబై నుండి వచ్చే రైళ్లు నైని, ప్రయాగ్‌రాజ్ చెవ్కీ స్టేషన్‌లలో ఆగుతాయి. దీనికి సంగం 11 కి.మీ దూరంలో ఉంది. ఇక లక్నో, అయోధ్య నుండి వచ్చే యాత్రికుల కోసం సంగం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న ఫాఫామౌ, ప్రయాగ్ స్టేషన్లలో ఇలాంటి రైళ్లు ఆగుతాయి. వారణాసి, గోరఖ్‌పూర్ నుండి ప్రయాణించే యాత్రికులు సంగంకి కొద్ది దూరం నడిచే ఝూన్సీ, రాంబాగ్ స్టేషన్‌లకు చేరుకోవచ్చు.
భక్తుల కోసం విమాన సర్వీసులు
కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం వివిధ విమానయాన సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, బిలాస్‌పూర్, హైదరాబాద్, రాయ్‌పూర్, లక్నో, భువనేశ్వర్, కోల్‌కతా, డెహ్రాడూన్, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాగ్‌రాజ్‌కు నేరుగా విమానాల ద్వారా పెద్ద ఎత్తున తీర్థయాత్రలు సాగేందుకు ఏర్పాట్లు చేశారు. విమానయాన సంస్థలు చెన్నై, జమ్మూ, పాట్నా, నాగ్‌పూర్, అయోధ్య, పూణే, భోపాల్ నుండి ప్రయాగ్‌రాజ్‌కి కూడా ప్రయాణించడానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం సంగం నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు నామమాత్రపు రుసుము రూ. 35తో అందుబాటులో ఉన్నాయి. టాక్సీలు, క్యాబ్‌లు కూడా రూ. 500, రూ. 1,000 మధ్య ధరలకు అందుబాటులో ఉంటాయి.
సరైన ప్రణాళికతో సురక్షితంగా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం కేంద్రం ఈ సారి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించింది. చరిత్రలో మరపురాని వేడుకగా చేసేందుకు, యాత్రికులు మెరుగైన అనుభూతి పొందేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారతీయ రైల్వేలు, విమానయాన సంస్థలు, యూపీఎస్‌ఆర్‌టిసీ కలిసి అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే కుంభమేళాకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సారి నిర్వహించే వేడుక ఇంతకుముందు జరిగిన కుంభమేళాలన్నింటిలోకెళ్లా ఉత్తమమైనదిగా నిలుస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.



















