Komatireddy Congress : ఉంటే ఉండు...పోతే పో ! కోమటిరెడ్డికి మధుయాష్కీ ఫైనల్ వార్నింగ్ !
కోమటిరెడ్డిపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైకమాండ్‌కు నివేదిక పంపింది. హైకమాండ్ నుంచి సూచనలు వచ్చాయేమో కానీ పార్టీలో ఉంటే ఉండాలని పోతే పోవాలని మధుయాష్కీ సీరియస్‌గా హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీలో ఉండాలనుకుంటే ఉండాలి లేకపోతే వెళ్లిపోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ సూటిగా హెచ్చరిక జారీ చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎవరూ హైదరబాద్‌లో వైఎస్ విజయలక్ష్మి ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లవద్దని టీ పీసీసీ సూచించింది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకెంతో అనుబంధం ఉందని వెళ్లి తీరతానని కోమటిరెడ్డి ప్రకటించడమే కాకుండా వెళ్లారు. అక్కడకు వెళ్లి మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుకు రాఖీ కడితే లేని తప్పు వైఎస్ సంస్మరణకు తాను వస్తే వస్తుందా అని ప్రశ్నించారు. ఇంకా పలు రకాల విమర్శలు చేయడం సంచలనం సృష్టించింది.
Also Read : కేసీఆర్ ఎకరాకు రూ. కోటి ఎలా సంపాదిస్తాడో చెప్పిన మహారాష్ట్ర మాజీ సీఎం
వైఎస్ విజయలక్ష్మి నిర్వహించింది రాజకీయ సమ్మేళనమేనని కాంగ్రెస్ పార్టీతో ఎదిగిన జగన్, షర్మిల ఇప్పుడు ఆ పార్టీ కొమ్మలనే నరకాలని చూస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్ జీవిత లక్ష్యమని పదే పదే చెప్పేవారని గుర్తు చేశారు. వైఎస్ అయినా.. కోమటిరెడ్డి అయినా చివరికి తాను అయినా సోనియా గాంధీ వల్లనే ఎదిగామనే సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీ నిర్ణయాన్ని కాదని వెళ్లి పార్టీపై విమర్శలు చేయడం ..పార్టీని నష్టపరచడమేనన్నారు. అంత గొప్ప అనుబంధం ఉంటే... తండ్రి ఆత్మీయ సమ్మేళనంకి కొడుకు జగన్ ఎందుకు రాలేదని మధుయాష్కీ ప్రశ్నించారు.
Also Read : హుజురాబాద్ ఉపఎన్నికలు దసరా తర్వాతే..!
సంస్మరణ సభలో వైఎస్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని విజయలక్ష్మి అన్నారని ఆ మాటలతో కోమటిరెడ్డి ఏకీభవిస్తున్నారా .. సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని అంతే కానీ పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవవద్దని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీతక్క రాఖీ కట్టడాన్ని కోమటిరెడ్డి తప్పు పట్టడాన్ని ఖండించారు. అన్నా చెల్లెళ్ల ఆత్మీయత తెలియని వ్యక్తులే రాఖీ కట్టడాన్ని కూడా రాజకీయం చేస్తారన్నారు. కాంగ్రెస్‌ని వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్ళి మాట్లాడటం పార్టీకి నష్టం చేయడమేనని ఆయనపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది హైకమాండ్ చూసుకుంటుందని మధు యాష్కీ స్పష్టం చేశారు.
Also Read : ఏపీ రోడ్ల బండారాన్ని బయట పెట్టిన జనసేన
కోమటిరెడ్డి వ్యవహారంపై టీ పీసీసీ హైకమాండ్‌కు నివేదిక పంపినట్లుగా తెలుస్తోంది. టీ పీసీసీ అధ్యక్షుడు తర్వాత అంతగా ప్రాధాన్యమున్న పదవి టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి కావడంతో కోమటిరెడ్డిపై మధుయాష్కీ చేసిన విమర్శలు కాంగ్రెస్ పార్టీలో హైలెట్ అవుతున్నాయి. హైకమాండ్ నుంచి సూచనలు రావడంతోనే కోమటిరెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని అంటున్నారు. మధుయాష్కీ విమర్శలపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారన్నదానిపై తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మలుపులు తిరిగే అవకాశం ఉంది.