Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Rains in Andhra Pradesh : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.
Rain Alert To Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. హిందూ మహాసముద్రం, దానిని అనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ బంగాళాఖాతంలోని నవంబర్ 25న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 నాటికి తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీచనున్నాయి.
ఏపీలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 26 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనుందని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడనం ప్రభావంతో గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
District forecast of Andhra Pradesh dated 23-11-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/fW5EInNBsb
— MC Amaravati (@AmaravatiMc) November 23, 2024
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట కోతకొచ్చే సమయం కనుక ధాన్యం తడవకుండా చూసుకోవాలని, వ్యవసాయ పనుల్లో రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో పొడి వాతావరణం
తెలంగాణలో మరో నాలుగు రోజులు పొడి వాతావరణం ఉంటుంది. నవంబర్ 28, 29 నుంచి తేలికాపటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదు కానున్నాయి. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉంది.
हैदराबाद शहर के लिए ज़ोन-वार पूर्वानुमान दिनांक: /Zone-wise forecast for Hyderabad city dated: 23.11.2024@IAS Association @GHMC @Telangana CMO @DistrictCollectors @Hyderabad Traffic Police #Telangana CMO #GHMC #TelanganaDGP #ghmccommissioner pic.twitter.com/9N92dz2bVe
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) November 23, 2024
దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పగటిపూట అత్యధికంగా ఖమ్మంలో 31.6 డిగ్రీలు, నిజామాబాద్ లో 31.4 డిగ్రీలు, భద్రాచలంలో 30.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్టంగా మెదక్ లో 11.4 డిగ్రీలు, ఆదిలాబాద్, పటాన్ చెరులో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆ ప్రాంతాల్లో చిన్నారులు, వృద్ధులు చలికి బాగా ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళ అత్యధికంగా నల్గొండలో 19 డిగ్రీలు, ఖమ్మం, భద్రాచలంలో 18 డిగ్రీలతో వేడిగానే ఉంది.