Loksabha Election 2024: టార్గెట్ 325, లోక్‌సభ ఎన్నికలపై జేపీ నడ్డా ఫోకస్ - త్వరలోనే కీలక భేటీ
Loksabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జేపీ నడ్డా కీలక భేటీకి పిలుపునిచ్చారు.
BJP Loksabha Election Strategies:
325 సీట్లు గెలవడమే లక్ష్యంగా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. హైకమాండ్ ఆదేశాల మేరకు కీలక నేతలందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 22-23 తేదీల్లో కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రతినిధులు, రాష్ట్రాల అధ్యక్షులు, స్టేట్ ఇన్‌ఛార్జ్‌లు, కో ఇన్‌ఛార్జ్‌లు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు. లోక్‌సభ ఎన్నికల్లో 325 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా అందరూ పని చేయాలని హితబోధ చేయనున్నారట. ఈ టార్గెట్‌కి తగ్గట్టుగా ఇప్పటి నుంచే అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. గత నెల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణలో ఎన్నికలు జరగ్గా ఇందులో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈ కీలకమైన మూడు రాష్ట్రాలనూ తమ ఖాతాలో వేసుకోవడంపై అధిష్ఠానం చాలా సంతృప్తిగా ఉంది. ఇదే జోష్‌ని కొనసాగించి లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంతో మూడు రాష్ట్రాలకూ ముగ్గురు కొత్త వ్యక్తులకు సీఎం పదవులు అప్పగించింది. ఈ భేటీలో చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. పార్టీనేతలకు పూర్తి స్థాయిలో ఉపదేశం చేసి పంపుతారని సమాచారం. ఇప్పటి వరకూ ఈ సమావేశంపై పూర్తి స్థాయి వివరాలు అందలేదు.
I.N.D.I.A కూటమి భేటీ..
అటు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే అలెర్ట్ అయ్యాయి. కేంద్రంలోని NDAని ఢీకొట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొన్నటి వరకూ 5 రాష్ట్రాల ఎన్నికలతో కాస్త సైలెంట్ అయిన I.N.D.I.A కూటమి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతోంది. మూడు రాష్ట్రాల్లో ఓడిపోయినప్పటికీ ఏ మాత్రం నిరాశ పడకుండా ప్రతిపక్ష కూటమిని ముందుండి నడపాలని చూస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే..కూటమిలోని కీలక నేతలతో సంప్రదింపులు జరిపారు. డిసెంబర్ 19వ తేదీన ఈ కూటమి నేతలు సమావేశం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ విజయరథాన్ని అడ్డుకోడానికి లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈ భేటీలోని నిర్ణయించున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 22 కోట్ల మంది ఓటర్ల మద్దతు లభించింది. ఈ సారి ఆ సంఖ్యని 35 కోట్లకు పెంచాలని జేపీ నడ్డా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో విపక్ష కూటమి ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.
నిజానికి గత వారమే ఈ సమావేశం జరగాల్సి ఉంది. కానీ అఖిలేశ్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ సహా మరి కొందరు ముఖ్య నేతలు హాజరు కాలేమని చెప్పారు. ఫలితంగా...తేదీని మార్చాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే కాంగ్రెస్ I.N.D.I.A కూటమి కార్యాచరణపై భేటీకి పిలుపునిచ్చింది. మూడు రోజుల పాటు సమావేశాలు జరగాలని భావించింది. కానీ..అప్పటికి అది కుదరలేదు. ఈ భేటీ జరగకపోయినప్పటికీ...కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమిపై రివ్యూ చేసుకుంది.
Also Read: Three New CM's: ముచ్చటగా ముగ్గురు, 3 రాష్ట్రాల్లో కొత్త వ్యక్తులకు సీఎం పదవి - బీజేపీ వ్యూహం ఏంటి?