Lok Sabha Election Results 2024: NDA పై రివెంజ్ తీర్చుకున్న థాక్రే, శరద్ పవార్ - అత్యధిక స్థానాల్లో వీళ్ల పార్టీలే ఆధిక్యం
Lok Sabha Election Results 2024: మహారాష్ట్రలో NDA కి ఎదురు నిలిచి థాక్రే, శరద్ పవార్ పార్టీలు అత్యధిక స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు.
Election Results 2024: పార్టీ చీలిపోయింది. పేరు మారిపోయింది. అయినా సరే గట్టిగా నిలబడి NDA వేవ్‌ని తట్టుకున్నారు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్. సొంత పార్టీ నుంచే రెబల్స్ పుట్టుకొచ్చి పార్టీ చీలిపోవడానికి కారణమయ్యారు. బీజేపీతో చేతులు కలిపారు. కానీ...ఈ ఇద్దరు నేతలు లోక్‌సభ ఎన్నికల్లో గట్టి ప్రభావాన్ని చూపించి ఎదురు దెబ్బ కొట్టారు. శివసేన, NCP పార్టీలు ముందంజలో ఉన్నాయి. థాక్రే సేన 11 చోట్ల లీడ్‌లో ఉండగా శరద్ పవార్ NCP 7 చోట్ల దూసుకుపోతోంది. ఇక ఏక్‌నాథ్ శిందే శివసేన 5 చోట్ల, అజిత్ పవార్ NCP ఒక చోట ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం NDA కి షాక్ ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. 2019లో శివసేనతో కలిసి పోటీ చేసింది బీజేపీ. 48 సీట్లకు గానూ 41 చోట్ల విజయకేతనం ఎగరేసింది. NCP నాలుగు స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ సారి అంత కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ తరవాత శివసేనతో తెగదెంపులు చేసుకుంది.
ఏక్‌నాథ్ శిందేకి బీజేపీయే కావాలని ఎర వేసి పార్టీని చీల్చిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. ఆ తరవాత శరద్ పవార్ NCPనీ ఇలాగే చీల్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అజిత్ పవార్ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఏక్‌నాథ్ శిందే ఇచ్చిన షాక్‌తో ఒక్కసారిగా ఆందోళన పడ్డ థాక్రే ఆ తరవాత తట్టుకుని గట్టిగా నిలబడ్డారు. బీజేపీపై డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్ శిందేకి లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా వేవ్ కనిపించడం లేదు. అటు అజిత్ పవార్ NCP కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. ప్రస్తుతమున్న ట్రెండ్ కొనసాగితే అటు థాక్రేతో పాటు శరద్ పవార్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశముంది. ఇది బీజేపీకి గట్టి షాక్ ఇవ్వనుంది. మళ్లీ మహావికాస్ అఘాడా ట్రాక్‌లోకి వస్తే బీజేపీకి సవాలు తప్పదు.