Lok Sabha election 2024 Phase 4: బెంగాల్ పోలింగ్‌లో ఉద్రిక్తతలు, టీఎమ్‌సీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ - ఒకరి మృతి
Lok Sabha election 2024 Phase 4 Voting: వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టీఎమ్‌సీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు.
Lok Sabha election 2024 Phase 4 Polling: లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 10 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. కొత్త ఓటర్ల నుంచి వృద్ధుల వరకూ అంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే...అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నా...బెంగాల్‌లో మాత్రం కాస్త హింసాత్మకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. బోల్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా పోలింగ్ జరిగే కొన్ని గంటల ముందే ఈ దాడులు జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మరి కొన్ని చోట్లా టీఎమ్‌స, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. వాళ్లను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. మొదటి రెండు గంటల పోలింగ్‌లో బెంగాల్‌లోనే అత్యధికంగా 15.24% ఓటు శాతం నమోదైంది.
#WATCH Durgapur, West Bengal: A clash broke out between BJP and TMC workers in Durgapur.#LokSabhaElections2024 pic.twitter.com/alSiQy6ldv
— ANI (@ANI) May 13, 2024
అటు జమ్ముకశ్మీర్‌లో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అటు ఏపీలోనూ ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే..బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓటర్లకు డబ్బు ఆశ చూపించిన ఓట్లు వేయించుకుంటున్నారని మండి పడుతున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద బీజేపీ స్టాల్స్‌ని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బెంగాల్‌లోని బరహంపూర్ పోలింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున అధిర్ రంజన్ చౌదరి, టీఎమ్‌సీ తరపున యూసుఫ్ పఠాన్ బరిలో ఉన్నారు. బెంగాల్‌తో పాటు అందరి దృష్టి యూపీపైనే ఉంది. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.