News
News
వీడియోలు ఆటలు
X

Lakhimpur Violence LIVE: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉద్రిక్తత.. ఎక్కడికక్కడ నేతల నిర్బంధం.. లఖింపుర్‌లో 144 సెక్షన్

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లఖింపుర్ బాధితులను కలిసేందుకు విపక్ష నేతలు చేస్తోన్న ప్రయత్నాలను యోగి సర్కార్ అడ్డుకుంటోంది.

FOLLOW US: 
దేశద్రోహం కేసు పెట్టాలి..

లఖింపుర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. రైతులపై తిరగబడాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు.

ఓవైసీ డిమాండ్..

లఖింపుర్ ఘటనపై ఏఐఎమ్‌ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇది చాలా హేయమైన చర్యగా ఓవైసీ అభివర్ణించారు. వెంటనే మూడు సాగు చట్టాలను మోదీ సర్కార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు కేంద్రమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.

రైతులకు పరిహారం..

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు ఉత్తర్‌ప్రదేశ్ ఏడీజీ ప్రశాంత్​ కుమార్​. ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు రూ.45 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

హింసాత్మక ఘటనలో మరణించిన భాజపా కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర డిమాండ్ చేశారు.

Background

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సీపీ సహా విపక్షాలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. 

లఖింపుర్​కు వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న విపక్ష నేతలను యోగి సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. సోమవారం ఉదయం ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. బాధితులను కలిసేందుకు బయలుదేరిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్​జిందర్ ఎస్ రంధావా.. తాము యూపీ పర్యటనకు రానున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిరువురినీ విమానాశ్రయంలోకి అనుమతించొద్దని యూపీ సీఎస్ అవనీశ్ అవస్థీ లఖ్​నవూ ఎయిర్​పోర్ట్ అధికారులకు లేఖ రాశారు.