Lakhimpur Incident: లఖింపుర్‌లో హై టెన్షన్.. కాంగ్రెస్ పర్యటనకు సర్కార్ నో.. తగ్గేదే లేదన్న రాహుల్
రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందానికి లఖింపుర్ ఖేరీ వచ్చేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ వస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఘటనపై ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. లఖింపుర్ ఖేరీకి వచ్చేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం నేడు లఖింపుర్ ఖేరీ జిల్లాకు రావాలనుకుంటున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. అలానే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండించింది.
లఖింపుర్ హింసాత్మక ఘటన రైతులపై ఓ ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. లఖింపుర్ ఖేరీకి కేవలం ముగ్గురే వెళ్తున్నట్లు రాహుల్ తెలిపారు. సెక్షన్ 144 తనను అడ్డుకోలేదని రాహుల్ స్పష్టం చేశారు.
లఖ్‌నవూలో 144..
శాంతి భద్రతలను పరిరక్షించేందుకు నవంబర్ 8 వరకు లఖ్‌నవూ పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. కొవిడ్ నియమాలు, రైతుల నిరసనలు, పలు ప్రవేశ పరీక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సీతాపుర్ అతిథి గృహం వద్ద ప్రియాంక గాంధీని ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకుండా దాదాపు 38 గంటలపాటు నిర్బంధించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. కనీసం ఆమె న్యాయవాదిని కూడా సంప్రదించడానికి అనుమతి ఇవ్వలేదని పేర్కొంది.
అయితే అనంతరం సీతాపుర్ జిల్లా హర్‌గావ్ పోలీసు స్టేషన్‌లో ప్రియాంక సహా 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెక్షన్ 151,107,116 కింద ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎఫ్ఐఆర్‌లో మాత్రం ప్రియాంకను అక్టోబర్ 4 ఉదయం 4.30 గంటలకే అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వ అతిథి గృహంలోనే నిర్బంధించారు.