Krishna District News: చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ పాస్టర్ ప్రచారం, పోలీసులు ఎంట్రీ!
Krishna District News: కృష్ణా జిల్లాలలోని ఓ పాస్టర్ చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. అంతేకాదు ప్లెక్సీని కూడా రూపొందించి ప్రజల్లోకి పంపారు.
Krishna District News: కల్యాణి నూనెతో పూనకాలు రప్పిస్తాం, ఒకే ఒక్క స్పర్షతో మీ ఆరోగ్య సమస్యలు, రోగాలు తీరుస్తామని చెప్పే పాస్టర్ లను మనం చాలానే చూశాం. ఇందుకు సంబంధించిన వందల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. దేవుని వాగ్ధానం పొందుకుని యోషయా 32:8 యేసు ప్రభువు పిలుపుతో మరణించి తిరిగి లేవబోతున్న దేవుడి సేవకుడు అంటూ చిత్రీకరించిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. యేసు ప్రభువు దేవుడు కాదు అనేవారి కోసం, పరలోకం, నరకం, ఆత్మ లేవు అనే వారి కోసం, తెలిసి కూడా వాటిని భయపడి జీవించలేని వారి కోసం ఇలా చేస్తున్నట్టు ఓ పాస్టర్ ప్రచారం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లపల్లికి చెందిన పాస్టర్ పులపాక నాగభూషణం... చనిపోయి మూడ్రోజుల తర్వాత తిరిగిన లేచొస్తానంటూ ప్రచారం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆయన సియోను బ్లెస్సింగ్ మెనిస్ట్రీస్ పేరిట స్థానికంగా చర్చి నిర్వహిస్తున్నారు. ఆయన చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ సంఘస్థులతో చెప్పాడని పలువురు తెలిపారు. నాగభూషణం తన సమాధికి స్థలం కూడా సిద్దం చేసినట్లు పేర్కొంటూ ఫ్లెక్సీని రూపొందించడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మతిస్థిమితం సరిగా లేకే నాగ భూషణం ఇలా ప్రవర్తిస్తున్నాడని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాస్టర్ కు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాది ఆఫ్రికాలో సమాధిలోకి వెళ్లిపోయిన పాస్టర్.. తవ్వి చూస్తే!
మానవ అవతారం దాల్చిన దేవుళ్లకు చావు ఉండదని, సజీవంగా సమాధిలోకి వెళ్లిపోతారని కొంతమంది నమ్ముతారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ సమాధి నుంచి ప్రాణాలతో బయటకు వస్తారని అనుకుంటారు. ఆఫ్రికాకు చెందిన ఓ పాస్టర్ కూడా ఇదే అనుకున్నాడు. ‘‘నేను దేవుడి.. బతికుండగానే నన్ను సమాధి చేయండి. మూడు రోజుల తర్వాత జీసస్‌లా ప్రాణాలతో తిరిగి వస్తా..’’ అని తన అనుచరులకు చెప్పాడు. అది నిజమే కాబోలు అనుకుని వారు అతడు చెప్పినట్లే చేశారు. మరి, అతడు మూడు రోజులైనా సమాధిలో బతికే ఉన్నాడా? ప్రాణాలతో బయటకు వచ్చాడా?
జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్ సకారా.. తనని తాను దైవం పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. తన అనుచరులు వద్దని వారిస్తున్నా.. అతడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పిక్నిక్ వెళ్లిన ఈజీగా మూడు రోజులు సమాధిలో ఉండి వచ్చేస్తానని చెప్పాడు.
‘‘ఆ దేవుడి బిడ్డలా నేను నేను కూడా మూడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను. మీరెవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపాడు. అయితే, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ముగ్గురు చర్చి సిబ్బందితో కలిసి ఈ ప్లాన్ చేశాడు. సుమారు నాలుగు అడుగుల గొయ్యి తవ్వారు. ఆ తర్వాత జేమ్స్ చేతులను వెనక్కి కట్టేసి బతికుండగానే అతడిని పూడ్చిపెట్టేశారు. మూడు రోజుల తర్వాత.. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారు. పాస్టర్ జేమ్స్ సమాధి నుంచి బయటకు రానున్నారని చెప్పారు. దీంతో జనమంతా అక్కడ గుమిగూడారు.
చర్చి సిబ్బంది సమాధి తవ్వారు. జేమ్స్ బతికి ఉంటాడని భావించారు. బ్యాడ్ లక్.. అప్పటికే జేమ్స్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు గాఢ నిద్రలో ఉన్నాడని, తప్పకుండా బతుకుతాడంటూ అతడి అనుచరులు ప్రార్థనలు చేశారు. కానీ, జేమ్స్ బతకలేదు. అతడిని సమాధిలో పడుకోబెట్టిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు. అయితే, ఇలాంటి స్టంట్లు ఆఫ్రికాలో సర్వసాధారణమే. అక్కడి ప్రజలను నమ్మించేందుకు కొంతమంది ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశ్వాసం ఉండవచ్చు.. కానీ, మూఢ విశ్వాసం ఉండకూడదని పలువురు హితవు పలుకుతున్నారు.