KA Paul Meets KCR: కేసీఆర్ కోలుకోవడానికి స్పెషల్ ఆయిల్ తెస్తా - పరామర్శించిన కేఏ పాల్
KA Paul News: కేఏ పాల్ ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ గతంలో కన్నా మరింత యాక్టివ్ గా ఉండడానికి తాను ఓ స్పెషల్ ఆయిల్ తో మళ్లీ వస్తానని చెప్పానని అన్నారు.
KCR Health News: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కాలు జారి పడిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించడానికి ప్రముఖులు వస్తున్నారు. కేసీఆర్ ను సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా పరామర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిసి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
అనంతరం కేఏ పాల్ ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ గతంలో కన్నా మరింత యాక్టివ్ గా ఉండడానికి తాను ఓ స్పెషల్ ఆయిల్ తో మళ్లీ వస్తానని చెప్పానని అన్నారు. అందుకు కేసీఆర్ కూడా సరే అన్నట్లు కేఏ పాల్ చెప్పారు. ఆ ఆయిల్ తో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పరంగా చూడొద్దని అన్నారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరని కేఏ పాల్ అన్నారు. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించడం శుభపరిణామమని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్ అద్భుతమైన స్వస్థత పొందుతారని, గతంలో కంటే యాక్టివ్ గా ఉంటారని చెప్పారు.
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు
నిన్ననే కేఏ పాల్ కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్, ఆయన కుటుంబం, బంధువులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న అధికారులెవ్వరూ.. దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచనలు చేశారు. వెంటనే కేసీఆర్‌తో పాటు ఆయన అనుచరులు, బంధువుల పాస్ పోర్టులు సీజ్ చేయించాలని కోరారు. నిన్న కేఏ పాల్ ఓ వీడియోను విడుదల చేశారు. దాంట్లో ఈ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, అందుకు కారణం కేసీఆర్ అండ్ కో అని కేఏ పాల్ ఆరోపించారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన అప్పులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఐఏఎస్‌లు, ప్రస్తుత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. సీఎం రేవంత్ రెడ్డికి సహకరించాలని పాల్ కోరారు.