(Source: ECI/ABP News/ABP Majha)
Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు - కమిటీలో డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీ
Waqf Bill 2024: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్రం ఇప్పుడు ఈ బిల్ రివ్యూ కోసం జేపీసీని ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 21 మంది సభ్యులను చేర్చింది.
Waqf Amendment Bill 2024: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఇటీవలే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండి పడుతున్నాయి. కేంద్రం మాత్రం వక్ఫ్ బోర్డు పేరుతో మాఫియా తయారవుతోందని, దాన్ని కట్టడి చేసేందుకే ప్రయత్నిస్తున్నామని తేల్చి చెప్పింది. ఏ మతానికీ ఇది వ్యతిరేకం కాదని వివరిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఈ బిల్లుని రివ్యూ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులుంటారని స్పష్టం చేశారు. వాళ్ల పేర్లనూ వెల్లడించారు. అధికార పక్షంలోని నేతలతో పాటు ప్రతిపక్షంలోనూ నాయకులనూ ఇందులో సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం. ఈ 21 మంది సభ్యుల్లో తేజస్వీ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీతో పాటు డీకే అరుణకు కూడా చోటు దక్కింది. ఈ జాబితాలో లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. ఈ కమిటీ బిల్లుని పూర్తి స్థాయిలో సమీక్షించనుంది. రాజ్యసభ నుంచి మరో 10 మంది సభ్యులను చేర్చేందుకు పేర్లు ప్రతిపాదించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు.
Waqf (Amendment) Bill, 2024 | List of 21 MPs from Lok Sabha who will be members of the Joint Parliamentary Committee (JPC), names of 10 Members from Rajya Sabha to be proposed soon. pic.twitter.com/IZTNlrRv0e
— ANI (@ANI) August 9, 2024
ఈ బిల్లుపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఇలా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఇందులో ప్రతిపక్ష ఎంపీలకూ చోటు ఇచ్చింది. బీజేపీ మిత్రపక్షాలు పూర్తిస్థాయిలో ఈ బిల్లుకి మద్దతు ఇచ్చాయి. ప్రతిపక్షాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే...కాంగ్రెస్ తప్పుల్ని సరి చేస్తున్నామని తేల్చి చెబుతోంది కేంద్రం. వక్ఫ్ బోర్డుల ఆధిపత్యం విషయంలో కాంగ్రెస్ చాలా ఉదాసీనంగా వ్యవహరించిందని స్పష్టం చేసింది. పైగా ఈ ప్రతిపాదనలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ చేసినవేనని, ఇప్పుడు తాము అమల్లోకి తీసుకొస్తున్నామని కిరణ్ రిజిజు వెల్లడించారు. కేవలం ఆ మాఫియాని కంట్రోల్ చేయడం తప్ప మరే ఉద్దేశమూ లేదని అన్నారు. (Also Read: Viral News: అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకు కుదింపు, వివాదాస్పద బిల్లు తీసుకొస్తున్న ఇరాక్)
వక్ఫ్ బోర్డుల పరిధిలో లక్షల ఎకరాలున్నాయి. వీటన్నింటిపైనా నిఘా పెట్టే అధికారం లభించేలా సవరణలు చేసింది కేంద్రం. వివాదాస్పద భూములను పరిశీలించడంతో పాటు వాటి పరిష్కార బాధ్యతల్ని కలెక్టర్లకే అప్పగించనుంది. అవి ప్రభుత్వ భూములా, లేదా వక్ఫ్ ఆస్తులా అన్నది కలెక్టర్లే తేల్చేస్తారు. ఇక ప్రత్యేకంగా సెంట్రల్ కౌన్సిల్‌నీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ కౌన్సిల్‌లో ముస్లిం మహిళలకూ చోటు దక్కనుంది. ముస్లిమేతరులనూ సభ్యులుగా చేర్చనుంది. దీనిపైనా ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Wayanad News: కేరళలో కొండచరియలు మళ్లీ విరిగిపడతాయా? మరోసారి వరదలకు అవకాశమెంత?