విదేశీ శక్తులతో రాహుల్ కుమ్మక్కయ్యారు, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది - జేపీ నడ్డా
JP Nadda on Rahul Gandhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
JP Nadda on Rahul Gandhi:
టూల్‌కిట్‌లో భాగమే..
రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. భారత దేశ వ్యతిరేక శక్తుల్లో రాహుల్ గాంధీ కూడా ఒకరు అంటూ తీవ్రంగా విమర్శించారు. యాంటీ ఇండియా "టూల్‌కిట్"లో రాహుల్ చేరిపోయారని ఆరోపించారు.
"రాహుల్ గాంధీ భారత్‌ను కించపరిచారు. పార్లమెంట్‌ను కూడా అవమానించారు. పరాయి దేశంలో మన దేశ పరువు తీశారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే వారితో చేతులు కలిపారు"
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
#WATCH | Congress now part of anti-national activities...Rahul Gandhi has now become a permanent part of this anti-nationalist toolkit: BJP President JP Nadda pic.twitter.com/whVG8cnSY3
— ANI (@ANI) March 17, 2023
భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే విదేశీ శక్తులతో రాహుల్ చేతులు కలుపుతున్నారని మండి పడ్డారు నడ్డా. అంతే కాదు. యూకేలో తన ప్రసంగంలో విదేశాలు భారత్ అంతర్గత విషయాల్లో కగలజేసుకోవాలని డిమాండ్ చేశారని అన్నారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రాహుల్ అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రాహుల్ వైఖరి విదేశీ కుట్రదారులను బలపరచకపోవడం కాకపోతే మరేంటి..? భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని..యూఎస్ యూరప్ కలగజేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని అన్నారు. ఇండియా ప్రజాస్వామ్యానికి ఖ్యాతి గడించిన దేశం. ఏ శక్తి కూడా దాన్ని విచ్ఛిన్నం చేయలేదు. ఇవాళ దేశంలో ఎవరూ కాంగ్రెస్ మాట వినడం లేదు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు. అందుకే అన్ని చోట్లా కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతోంది. జార్జ్ సోరోస్, రాహుల్ ఒకేలా మాట్లాడటంలో అంతరార్థం ఏంటి..? రాహుల్ తప్పకుండా దేశానికి క్షమాపణలు చెప్పాలి. "
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ భారత్‌పై, మోదీ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్‌ను కించపరిచారంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. ఇటీవలే ఆ పర్యటన ముగించి వచ్చిన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మోదీ హయాంలో నిజంగా ప్రజాస్వామ్యమనేదే ఉంటే...కచ్చితంగా తనకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో గౌతమ్ అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను పార్లమెంట్‌లోకి వచ్చిన మరు నిముషమే సభను వాయిదా వేస్తారని విమర్శించారు.
"నాకు మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కుని ప్రజాస్వామ్యం కల్పించింది. నిజంగా దేశంలో డెమొక్రసీ ఉంటే నేను పార్లమెంట్‌లో మాట్లాడగలిగే వాడిని. ఇది నిజంగా మన దేశ ప్రజాస్వామ్యానికి పరీక్ష. అదానీ అంశంపై మేం పదేపదే ప్రశ్నిస్తున్నాం. అందుకే మోదీ సర్కార్ భయపడుతోంది. ఇకపై నాకు పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అనుమతి దొరకకపోవచ్చు. మోదీ, అదానీ మధ్య సంబంధం ఏంటి అనేదే నా ప్రశ్న. అదానీ అంశంపై నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారు. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని దాచేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. నేను ఇవాళ ఉదయం పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాను. నలుగురు మంత్రులు నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నాపై ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం నేను పార్లమెంట్‌లో అదానీ అంశం గురించి మాట్లాడాను. దాన్ని రికార్డుల నుంచి తొలగించారు. "
- రాహుల్ గాంధీ
Also Read: ప్రధాని మోదీకి నోబుల్ శాంతి బహుమతి! అబ్బే ఉత్తుత్తి ప్రచారమే