ప్రధాని మోదీకి నోబుల్ శాంతి బహుమతి! అబ్బే ఉత్తుత్తి ప్రచారమే
Nobel Peace Prize: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ఉన్నారన్న ప్రచారం అవాస్తవం అని నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లేటోజే తేల్చి చెప్పారు.
ప్రచారం..
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన పోటీదారుగా ఉన్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి అతిపెద్ద పోటీదారు అని అస్లే టోజే మాట్లాడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై అస్లే టోజే క్లారిటీ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతికి మోదీ అతిపెద్ద పోటీదారు అని తాను అనలేదని స్పష్టంచేశారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.
సోషల్ మీడియాలో పోస్ట్‌లు
రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధాన్ని నిలువరించడానికి మోదీ కృషి చేశారని, దీనికోసం ఆయన ఆ రెండు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీతో పలుమార్లు ఫోన్ లో సంభాషించారంటూ వార్తలొచ్చాయి. ఈ కృషిని నోబెల్ కమిటీ గుర్తించిందని, ఇక ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి అందుతుందంటూ అటు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు కనిపించాయి. అయితే.. నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును నోబెల్ కమిటీ పరిశీలిస్తోందన్న వార్తలు పూర్తిగా అసత్యమని, నిరాధారమని ఆస్లే టోజే స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనేదీ కమిటీ వద్ద లేదని తేల్చి చెప్పారు. అలాంటి వ్యాఖ్య కానీ, అలాంటి వ్యాఖ్యతో సంబంధమున్న ఎలాంటి ట్వీట్ కానీ తాను చేయలేదని వివరణ ఇచ్చారు.
అంతా ఫేక్..
నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరును పరిశీలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్ ఫేక్ అని.. దానిపై చర్చలు జరిపి, దానికి మరింత ప్రాచుర్యం కల్పించవద్దని ఆస్లే టోజే సూచించారు. తాను చెప్పిందొకటి.. బయట ప్రచారంలోకి వచ్చిందొకటని తేల్చి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తాను నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ హోదాలో పర్యటించట్లేదని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్‌స్టాండింగ్ కమిటీ డైరెక్టర్ గా మాత్రమే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు.