Jharkhand GOVT Crisis: ఝార్ఖండ్‌లో రిసార్ట్ రాజకీయాలు మొదలు, భాజపా నుంచి కాపాడుకోటానికేనా?
Jharkhand GOVT Crisis: ఝార్ఖండ్‌లో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి.
Jharkhand GOVT Crisis:
రాయ్‌పూర్‌లోని రిసార్ట్‌కు..
ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. అధికార యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ (UPA)కు చెందిన 31 ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. భాజపా ఈ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్న అనుమానంతో ఇలా వారందరినీ వేరే చోటకు తరలించారు. రాయ్‌పూర్‌లోని మే ఫేర్ రిసార్ట్‌లో ఈ ఎమ్మెల్యేలకు నివాసం ఏర్పాటు చేశారు. దాదాపు రెండ్రోజుల పాటు వాళ్లు ఇక్కడే ఉండనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నేతలు గిరీశ్ దేవాంగన్, సన్నీ అగర్వాల్, రామ్ గోపాల్ అగర్వాల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌తో పాటు ఝార్ఖండ్ ముక్తి మోర్ఛ్ (JMM)కి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాగేల్ రిసార్ట్‌కు వెళ్లారు. కొందరు JMM ఎమ్మెల్యేలు, మంత్రులు రాంచీలోనే ఉండి ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా అధిగమించాలనే అంశంపై సమాలో చనలు చేయనున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు మంత్రులు కూడా రాయ్‌పూర్ బాట పట్టారు. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హతా వేటు వేశారు. "రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర గురించి ఎప్పుడైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం" అని సోరెన్ ఇప్పటికే ప్రకటించారు. ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన వ్యూహాలు తమ వద్ద ఉన్నాయని...తొందర్లోనే అవి బయటపెడదామని వివరించారు. అయితే..ఆ ఎమ్మెల్యేలతో పాటు రిసార్ట్‌లో ఉంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సరైన సమాధానం చెప్పలేదు.
భాజపా ఏం ఆలోచిస్తోంది..?
అటు భాజపా...ఝార్ఖండ్‌లోని పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అయితే...నంబర్ విషయంలో ఆ పార్టీ కాస్త తడబడుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు భాజపాతో టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నా...అదెంత వరకు నిజం అన్నది తేలలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని కొందరు భావిస్తుంటే...అలాంటిదేమీ అవసరం లేదని మరి కొందరు వాదిస్తున్నారు. అందుకే...భాజపా పూర్తి స్థాయిలో పరిస్థితుల్ని సమీక్షించాక అప్పుడు ఓ నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత బాబూలాల్ మరండి తన అభిప్రాయాన్ని చాలా కచ్చితంగా చెబుతున్నారు. జేఎమ్‌ఎమ్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటం కాకుండా.. వచ్చే ఎన్నికల్లో పోటాపోటీగా నిలవాలని ఆయన అధిష్ఠానానికి సూచనలు చేస్తున్నట్టు సమాచారం. ఎలాగో ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల్లో ఓటర్లు భాజపా వైపే మొగ్గుతారని జోస్యం చెబుతున్నారు. ఆగస్టు 27న 39 మంది యూపీఏ ఎమ్మెల్యేలు కుంతి జిల్లాలోని ఓ గెస్ట్ హౌజ్‌కు వెళ్లారు. అక్కడే ఓ నాలుగు గంటల పాటు ఉండి తరవాత మళ్లీ రాంచీకి తిరుగు పయన మయ్యారు. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఝార్ఖండ్‌లో ఉండటం కన్నా...వేరే రాష్ట్రానికి వెళ్లిపోతే భాజపా మభ్య పెట్టడానికి వీల్లేకుండా ఉంటుందని భావించారు. అసలు దీనంతటికీ కారణం...భాజపా సీఎం సోరెన్‌పై ఫిర్యాదు చేయటం. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ...భాజపా ఆయనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. చివరకు ఎన్నికల సంఘం సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హతా వేటు వేసింది. అప్పటి నుంచి అక్కడి రాజకీయాలు మారిపోయాయి.
Also Read: Cobra Movie Review - 'కోబ్రా' రివ్యూ : విక్రమ్ సినిమా ఎలా ఉంది? తెలుగులో హిట్ అవుతుందా?